గ్రేటర్ హైదరాబాద్లో టీఆర్ఎస్కు తిరుగులేని విజయం సాధించి పెట్టి.. నేరుగా సచివాలయానికి దారి చేసుకోవాలని కేటీఆర్ పట్టుదలగా ఉన్నారు. 2016గ్రేటర్ ఎన్నికల్లో 150డివిజన్లకు గాను 99స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకుంది. అది భారీ విజయం. ఈ సారి అంతకన్నా భారీ విజయం నమోదు చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. వంద స్థానాలను గెలవాలని మంత్రి కేటీఆర్ టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇప్పటికే ఆయన రంగంలోకి దిగారు. అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు… శంకుస్థాపనలతో హడావుడిగా గడుపుతున్నారు.
2016జీహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యతలను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. కేటీఆర్ కే అప్పగించారు. తండ్రి అప్పజెప్పిన బాధ్యతను సవాల్ గా తీసుకున్న కేటీఆర్ గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం నుంచి అన్నీ తానై వ్యవహరించారు. పరిస్థితులకు ఎదురీది 99స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకున్నారు. దీంతో ఐటీశాఖ మంత్రిగా కేటీఆర్ కు.. మున్సిపల్ శాఖను కూడా కేసీఆర్ బోనస్ గా ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో కేటీఆర్ విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ తిరుగులేని విజయాన్ని సాధించింది.
కేటీఆర్ వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. కేబుల్ బ్రిడ్జ్, ఫ్లై ఓవర్లు, రోడ్లు, ఫుట్ ఫాత్ లు, పార్కులు, జిమ్ ల ప్రారంభాలకు హాజరవుతూ.. బస్తీల్లో ఎన్నికల వాతావరణాన్ని తీసుకొస్తున్నారు. మరోవైపు గ్రేటర్ లో ముస్లిం మైనారిటీ ఓట్లు అధికంగా ఉండటంతో గతవారం హోంమంత్రి మహమూద్ అలీతో సమావేశమై ముస్లిం ఓట్ బ్యాంక్ పై చర్చించారు. తాజాగా పాస్టర్లు, బిషప్స్ తో సమావేశమైన కేటీఆర్.. క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. త్వరలో క్రిస్టియన్ భవన్, గ్రేవ్ యార్డ్ పనులు ప్రారంభించనున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను బస్తీల్లో పరుగులు పెట్టిస్తున్నారు. 100 స్థానాలకుపైగా గెల్చుకుంటే… మిత్రపక్షం ఎంఐఎంకు మరో 30 స్థానాలొస్తాయి. దీంతో బల్దియాలో విపక్షాలకు చోటు ఉండదని నమ్మకంగా ఉన్నారు.