తెలంగాణలో ఐటీ పరిశ్రమ అభివృద్ధి మోత మోగుతోంది. హైదరాబాద్ లో ఈ పరిశ్రమ వేలకోట్ల రూపాయల మేర ఎగుమతులు చేయడమే కాదు, లక్షల మందికి ఉద్యోగాలిస్తోంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నుంచి 75 వేల కోట్ల రూపాయల ఐటీ ఎగుమతులు జరిగినట్టు రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రకటించారు. గత ఏడాది ఇదే కాలంలో 66 వేల 276 కోట్ల రూపాయల ఎగుమతులు జరిగాయి.
టీహబ్ ద్వారా బడా పరిశ్రమలను హైదరాబాదుకు రప్పించడానికి కేసీఆర్ ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. ఐటీ ప్రపంచంలో ఇప్పటికే ఉన్న పేరును ఉపయోగించుకుని మరిన్ని కంపెనీలను రప్పించడానికి ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే, తమ హయాంలో ఈ ఎగుమతులు రెట్టింపు చేయాలనేది లక్ష్యమని కేటీఆర్ చెప్పారు. అంటే లక్షా 50 వేల కోట్ల మేర ఎగుమతులు సాధించాలనే పెద్ద టార్గెట్ ను నిర్దేశించుకున్నారు.
హైదరాబాదులో ఐటీ పరిశ్రమ కేవలం గత ఏడాదిలోనే 35,611 మంది ప్రొఫెషల్స్ కు ఉద్యోగాలిచ్చింది. మొత్తం ఉద్యోగుల సంఖ్య 4 లక్షల 7 వేల 385కు చేరింది. వివిధ రంగాల్లో పరోక్షంగా ఐటీ పరిశ్రమ వల్ల ఉద్యోగాలు, స్వయం ఉపాధి పొందిన వారు కూడా లక్షల్లోనే ఉంటారు.
ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాటిన ఐటీ పరిశ్రమ అనే బీజం వట వృక్షంగా ఎదిగి లక్షల మందికి నీడనిస్తోంది. వేల కోట్ల రూపాయల విలువైన ఎగుమతులు చేస్తోంది. కంపెనీలకు లాభాలను ఆర్జించి పెడుతోంది. నిపుణులకే కాదు, సాధారణ విద్య చదివిన వారికి కూడా ఉద్యోగాలు ఇస్తోంది. బెంగళూరుతో పోటీ పడే స్థాయిలో ఎదిగిన ఐటీ పరిశ్రమకు హైదరాబాదును కేంద్ర బిందువుగా చేయాలని యువ మంత్రి కేటీఆర్ భావిస్తున్నారు. ఇటీవల రెండు వారాలు అమెరికాలో పర్యటించి వచ్చారు. ఆ పర్యటన ఫలాలు మరికొన్ని రోజుల్లో కనిపించవచ్చు.
తమ లక్ష్య సాధన కోసం ఐటీ పరిశ్రమలకు మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ ను హైదరాబాదులో ఏర్పాటు చేస్తామని కేటీఆర్ చెప్పారు. దీని విధి విధానాలు మూడు నెలల్లో ప్రకటిస్తామని వివరించారు. మొత్తానికి ఐటీ రంగంలో హైదరాబాద్ ను అగ్రగామిగా చేయడానికి కేటీఆర్ ఒక విజన్ తో పని చేస్తున్నట్టు కనిపిస్తోంది.