తెలంగాణ యువతలో ఉన్న ఆసక్తికి ఊతం అందించేందుకు కేటీఆర్ టీ హబ్ ఆలోచన చేశారు. ఇప్పటికే ఓ ప్రయత్నం సక్సెస్ అయింది. ఇప్పుడు టీ – హబ్ 2ను కూడా రెడీ చేశారు. టెక్ ప్రపంచంలో రాణించాలనుకునే యువత స్టార్టప్ ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకుఈ హబ్ ఉపయోగపడుతుంది. స్టార్టప్ ఆలోచలను ఆచరణలోకి తీసుకొచ్చేందుకు జరిగే ప్రక్రియంతా స్టార్టప్ ఇంక్యుబేటర్ల వేదికగానే జరుగుతుంది. ఇలాంటి ఏర్పాటు లేక చాలా స్టార్టప్‌ల గమ్యస్థానం మారిపోయింది. కానీ కేటీఆర్ మాత్రం ఈ సమస్యను తొందరగాే గుర్తించారు.
2015లో స్టార్టప్‌లను ప్రభుత్వపరంగా ప్రోత్సహించేందుకు రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలో దీని ప్రస్థానం ప్రారంభమైంది. గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ, ఐఎస్బీ, నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా సంస్థలతో కలిసి తెలంగాణ ప్రభుత్వం టీ హబ్‌ను ఏర్పాటు చేసింది. మొదటి దశలో భాగంగా ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఏర్పాటుచేసిన టీ హబ్‌లో చేరేందుకు రాష్ట్రం నుంచే కాకుండా దేశ, విదేశీ స్టార్టప్‌లూ పోటీపడ్డాయి. ఆరేళ్ల వివిధ కార్యక్రమాల ద్వారా 1,800 స్టార్టప్‌లను టీ హబ్ ప్రోత్సహించింది. సుమారు 600 కంపెనీలతో కలిసి పనిచేసింది.
ఈ క్రమంలోనే మరిన్ని అవకాశాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం టీ హబ్-2ను రెడీ చేసింది. మాదాపూర్-రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో దాదాపుగా ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ హబ్-2 నిర్మాణం అయింది. ఒకేసారి 1,500 స్టార్టప్‌లు తమ కార్యకలాపాలను నిర్వహించేందుకు అవసరమైన మౌలిక వసతులు ఉన్నాయి. ఈ టీ హబ్ 28వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. కేటీఆర్ ఈ టీహబ్ ఏర్పాటుతో తెలంగాణ నుంచి ప్రపంచ వ్యాపార సామ్రాజ్యాన్ని మార్చే స్టార్టప్ తెలంగాణ నుంచి వచ్చేలా మౌలిక వసతులు సమకూర్చారు.