సీఎం కేసీఆర్ రాజకీయ ఆస్తుల పంపకానికి జోరుగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా టీఆర్ఎస్లో ప్రచారం గుప్పుమంటోంది. కేటీఆర్ సీఎం అనే నినాదం ఇప్పటికే ఫిక్సయిపోయింది. మరి కవిత ఏంటీ అనేచర్చ వస్తోంది. కవితను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఖరారు చేశారని అంటున్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికలయిన తర్వాత కవిత విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇప్పుడు ఆమె కార్మిక సంఘాలను ఏకం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. టీఆర్ఎస్ గెలుపులో కార్మిక సంఘాలు అత్యంత కీలకం.
ఉద్యమ సమయంలో ఉద్యోగుల నుంచి కుల సంఘాల వరకు అన్నింటినీ ఏర్పాటు చేయడంలో టీఆర్ఎస్ కీలకంగా వ్యవహరించింది. వివిధ ఉద్యోగ, కార్మిక సంఘాలకు ఆ పార్టీ నేతలే గౌరవాధ్యక్షులుగా ఉండేవారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వైఖరిని పూర్తిగా మార్చుకుంది. కొన్ని సంఘాల నుంచి వచ్చిన తలనొప్పులతో ఆయా సంఘాలకు గౌరవాధ్యక్ష పదవుల నుంచి టీఆర్ఎస్ నేతలు తప్పుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. అలా ఆర్టీసీ కార్మిక సంఘం నుంచి హరీష్ రావు, సింగరేణి కార్మిక సంఘం నుంచి కవిత కూడా వైదొలిగారు. మిగతా నేతలు కూడా వైదొలిగారు. దీంతో ఉద్యోగ, కార్మిక సంఘాల్లో టీఆర్ఎస్ పట్టు తగ్గింది.
దుబ్బాక ఎన్నికల్లో ఓటమి, జీహెచ్ఎంసీ ఫలితాలు టీఆర్ఎస్కు గుబులు పుట్టించాయి. దీంతో దూరమైన సంఘాలను వర్గాలను చేరదీసే పనిలో పడ్డారు. ఆ బాధ్యత కవితకు అప్పగించారు. ఇటీవల కవిత విస్తృతంగా పర్యటిస్తున్నారు. కవితను పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ చేసి ఆ తర్వాత కీలక పదవులు అప్పగించేందుకు నిర్ణయించారని ఈ కారణంగానే అనుకుంటున్నారు. కవితను మంత్రివర్గంలోకి తీసుకుంటారని ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. అయితే కేటీఆర్ సీఎం అయితే సాధ్యం కాకపోవచ్చు. అందుకే కవితకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలనే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. అది వర్కింగ్ ప్రెసిడెంటే కావొచ్చని అంటున్నారు.