తెలంగాణ మంత్రి కేటీఆర్‌కూ కరోనా పాజిటివ్‌గా తేలింది. స్వల్ప లక్షణాలు ఉండటంతో కేటీఆర్ పరీక్ష చేయించుకున్నారు. దాంట్లో వైరల్ సోకినట్లగా తేలింది. దాంతో కేటీఆర్ హోమ్ ఐసోలేషన్లోకి వెళ్లారు. నాలుగు రోజుల కిందట.. కేటీఆర్ తండ్రి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరోనాగా తేలింది. నిన్న కేసీఆర్ వెన్నంటి ఉండే ఎంపీ సంతోష్‌కు కూడా పాజిటివ్‌గా తేలింది. ఇవాళ… కేటీఆర్‌నూ వైరస్ పట్టుకుంది. అయితే.. అందరికీ స్వల్ప లక్షణాలు ఉండటమో… అసలు లక్షణాలు లేకపోవడమో ఉండటంతో… అందరూ ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నారు.
ముఖ్యమంత్రితో పాటు యాక్టింగ్ చీఫ్ మినిస్టర్‌గా పేరున్న కేటీఆర్‌కూ పాజిటివ్ రావడంతో.. అధికారవర్గాల్లో కలకలం పేరుతోంది. ఇప్పటికే పలువురు మంత్రులకూ పాజిటివ్ వచ్చింది. వారు కూడా హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. అధికారయంత్రాంగం మొత్తాన్ని .. కరోనా పట్టి పీడిస్తూండటంతో… తాత్కలిక సచివాలయం అయిన బీఆర్కే భవన్ కూడా బోసిపోతోంది. ఉద్యోగులు విధులు నిర్వహించడానికి భయపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం.. చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్‌కు కూడా.. పాజిటివ్‌గా తేలింది. అయితే ఆయన కోలుకుని విధులు నిర్వహిస్తున్నారు.
తెలంగాణలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని.. తాజాగా వెల్లడవుతున్న కేసులతో తెలుస్తోంది. గాంధీ ఆస్పత్రిలో ఆరు వందల ఐసీయూ బెడ్లు ఉంటే.. మొత్తం ఫుల్ అయిపోయాయని.. మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. ఇతర ఆస్పత్రుల్లోనూ అదే పరిస్థితి. ఇప్పటికే కరోనా కట్టడి చర్యలు తీసుకున్నారు. నైట్ కర్ఫ్యూ విధించారు.