అరె అప్పుడే కొత్త డిజిగ్నేషన్ వచ్చేసిందా అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.. దాదాపుగా వచ్చేసినట్టే. ఎందుకంటే.. తెరాసకు విజయాన్ని అందించండి. మీ గల్లి గల్లీలు తిరిగి మీ బాధలు చూసిన కేటీఆర్ కు మునిసిపల్ శాఖ ఇస్తా.. మీ కష్టాలు అన్నీ తీరుస్తడు అని కేసీఆర్ ప్రకటించిన సంగతి గుర్తుంది కదా.. కాబట్టి.. కేటీఆర్ అప్పుడే మునిసిపల్ మంత్రి అయిపోయినట్టే లెక్క.
గ్రేటర్ ఫలితాల తర్వాత.. శుక్రవారం సాయంత్రం 6.15 కు నిర్వహించిన ప్రెస్మీట్లో కేటీఆర్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం మీద గ్రేటర్ ప్రజలు వ్యక్తం చేసిన విశ్వాసానికి ఇది నిదర్శనం అని వ్యాఖ్యానించారు. ఈ విజయంతో తమ బాధ్యత ఇంకా ఎంతో పెరిగిందని చెప్పారు. ఈ విజయాన్ని చూసినతర్వాత కూడా కేసీఆర్ పాలన గురించి ప్రతిపక్షాలు దుష్ప్రచారానికి పూనుకుంటే.. వారికే నష్టం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించాలన్నారు.
పార్టీ విజయానికి శ్రమించిన నేతలు, కార్యకర్తలు అందరికీ కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. అపూర్వ విజయాన్ని అందించిన హైదరాబాదీలకు శిరసు వంచి నమస్కరిస్తున్నా అని కేటీఆర్ అన్నారు. ఈ విజయం తమ ప్రభుత్వం బాధ్యతను మరింతగా పెంచిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ నేతృత్వంలో మరోసారి పార్టీ రికార్డు సృష్టించిందన్నారు. గ్రేటర్ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటాం అని.. పార్టీ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిందని కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.