ఫార్ములా ఈ రేసు కేసులో విచారణకు హాజరు కావాలని కేటీఆర్ నిర్ణయించుకున్నారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ పై తీర్పు పెండింగ్ లో ఉంది. అది అనుకూలంగా వస్తుందని ఆయన చాలా గట్టి నమ్మకంతో ఉన్నారు. కానీ ఆ తీర్పు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ లోపు ఏసీబీ అధికారులు తమ ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. వెళదామా వద్దా.. అని న్యాయనిపుణులతో తర్జనభర్జన పడిన తర్వాత కేటీఆర్ వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. వెళ్లకపోతే విచారణకు సహకరించలేదన్న ప్రచారాన్ని చేస్తారు. వెళ్లడమే మంచిదని న్యాయనిపుణులు సలహాలు ఇవ్వడంతో కేటీఆర్ రెడీ అయినట్లుగా తెలుస్తోంది.
కేటీఆర్ విచారణకు హాజరైనా అరెస్టు చేసే అవకాశాలు ఉండకపోవచ్చు. ఆయనకు అరెస్టు నుంచి హైకోర్టు రక్షణ కల్పించింది. తీర్పు వచ్చే వరకూ ఆరెస్టు చేయవద్దని తెలిపింది. అయితే కేటీఆర్ ను సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ రోజు ఏసీబీ అయితే.. మంగళవారం ఈడీ అధికారుల ఎదుట ఆయన హాజరు కావాల్సి ఉంది. ఏసీబీ ఎదుట విచారణకు హాజరయ్యే ఆయన… ఈడీ ఎదుట కూడా హాజరవుతారా లేదా అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.ఎందుకంటే ఈడీకి అరెస్టు చేయవద్దనే ఆదేశాలు కోర్టు నుంచి లేవు. ఈడీ అరెస్టు చేయాలనుకుంటే చేయవచ్చు.
ఇప్పటికే ఈడీ ఎదుట హాజరు కావాల్సిన ఐఏఎస్ అర్వింద్ కుమార్, A 3 గా ఉన్న గ్రేటర్ మాజీ చీఫ్ ఇంజినీర్ లు తమకు సమయం కావాలని చెప్పి డుమ్మా కొట్టారు. వారికి ఈడీ వారం సమయం ఇచ్చింది.ఇప్పుడు కేటీఆర్ కూడా అడిగితే వారం వరకూ సమయం ఇచ్చే అవకాశం ఉంది. అయితే కేటీఆర్ ఏం చేస్తారన్నది కీలకం. ఏసీబీ విచారణకు హాజరవుతున్నందున.. తన తప్పేమీ లేదందున.. విచారణకు హాజరవ్వాలని ఆయన అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.