ప్రతి ఏడాది జనవరిలో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరు కావాలని తెలంగాణ మంత్రి కేటీఆర్కు ఆహ్వానం అందింది. కరోనా పరిస్థితుల నుంచి తెలంగాణ వేగంగా బయటపడటానికి ఆయన చేస్తున్న కృషిని గుర్తించి ఆహ్వానిస్తున్నట్లుగా ప్రపంచ ఆర్థిక వేదిక తెలిపింది. తెలంగాణను సాంకేతిక రంగంలో రారాజుగా కేటీఆర్ నిలిపారని డబ్ల్యూఈఎఫ్ అధ్యక్షుడు ప్రశంసలు గుప్పించారు. ఆ ఆహ్వానంపై కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ ప్రభుత్వానికి దక్కిన గౌరవంగా భావిస్తామని ప్రకటించారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తానన్నారు.
ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు అంటే ప్రపంచ దేశాల నుంచి బడా బడా పారిశ్రామికవేత్తలు అందరూ వెళ్తారు. పెట్టుబడులు ఆకర్షించాలనుకునే ప్రభుత్వాలు అక్కడ ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేసి.. తమ తమ రాష్ట్రాల్లో ఉన్న అవకాశాల గురించి పబ్లిసిటీ చేస్తూంటాయి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అలాగే చేసేది. కియా పరిశ్రమను దావోస్ సదస్సుల ద్వారానే పెట్టబడుల ప్రతిపాదనలతో తీసుకొచ్చారన్న అభిప్రాయాన్ని అప్పట్లో అధికారులు చెప్పేవారు. పలు రకాల పరిశ్రమలు రావడానికి దావోస్లో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన ప్రజెంటేషన్లే కారణమన్న అభిప్రాయాలు ఉన్నాయి.
అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ ప్రభుత్వ పరంగా దావోస్లో ఎలాంటి పెట్టుబడుల ప్రయత్నాలు చేయడం లేదు. మొదటి ఏడాది విద్యుత్ రంగంలో పీపీఏల రద్దు వివాదం ఉండటంతో ఏపీ గురించి దావోస్లో నెగెటివ్ ప్రచారం జరిగింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడుల ప్రయత్నాలు చేస్తున్నందు వల్ల దావోస్లో ఈ సారి ఏపీ ప్రాతినిధ్యం ఉంటుందని భావిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక ఆహ్వానించకపోయినా… ఏపీ స్టాల్ను ఏర్పాటు చేస్తారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికైతే వరల్డ్ ఎకనమిక్ ఫోరం నుంచి ఎలాంటి ఆహ్వానం ఏపీ ప్రభుత్వానికి అందలేదని తెలుస్తోంది.