తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ త్వరలో ముఖ్యమంత్రి కాబోతున్నారు అనే చర్చ ఈ మధ్య జరిగిన సంగతి తెలిసిందే. కొందరు మంత్రులు పోటీపడి మరీ ప్రకటనలు చేశారు. అయితే, అలాంటిదేం లేదంటూ కేటీఆర్, దుక్కలా ఉన్నానంటూ సీఎం కేసీఆర్ ప్రకటనలు చేశారు. అయినా చర్చ ఆగలేదు. ఎందుకంటే, మళ్లీ జాతీయ రాజకీయాల కలల్ని తెర మీదికి కేసీఆర్ తేవడంతో… ఆయన ఢిల్లీకి వెళ్తే, ఈయన సీఎం సీట్లో కూర్చుంటారనే అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. ఇప్పుడు కొత్తగా మరో చర్చ తెరాస వర్గాల్లో వినిపిస్తోంది. అదేంటంటే… కేటీఆర్ కి అదనంగా కొత్త బాధ్యతలు అప్పగించబోతున్నారట!
నిజానికి, కేటీఆర్ ని భవిష్యత్తు సారథిగా నిలబెట్టేందుకు ఒక పద్ధతి ప్రకారం కేసీఆర్ వ్యవహరిస్తూ వస్తున్నారనే చెప్పాలి. ముందుగా పార్టీ బాధ్యతలు కేటీఆర్ కి అప్పగించారు. అంతేకాదు, ఎన్నికల్లో పార్టీ బాధ్యతలు కూడా మొత్తం తనయుడి మీదే వదిలేశారు. కేటీఆర్ మరో అడుగు ముందుకేసి… గడచిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు తానే పూర్తి బాధ్యత వహిస్తానని ప్రకటించారు, ఎక్కడికీ ప్రచారానికి వెళ్లకుండానే పార్టీని విజయపథంలో నడిపించారు. దశలవారీగా… ‘కేటీఆర్ సమర్థుడైన నాయకుడు’ అని నిరూపించుకునేందుకు కావాల్సిన వేదికను కేసీఆర్ సెట్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కేటీఆర్ కి కొత్త బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం మొదలైంది. అదేంటంటే… ఉప ముఖ్యమంత్రి పదవి!
రెండోసారి తెరాస అధికారంలోకి వచ్చాక ఉప ముఖ్యమంత్రులే లేరు. తొలిసారి ఇద్దరుండేవారు. వారిలో ఒకరైన రాజయ్య మొదట్లోనే పదవిని పోగొట్టుకున్నారు, ఆయన స్థానంలో కడియం శ్రీహరికి అవకాశం ఇచ్చారు. రెండోవారిగా మహమూద్ అలీ పదవి పొందారు. ఇదంతా గతం… ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పోస్టు ఎవ్వరికీ లేదు. ఇప్పుడు కేటీఆర్ ని డెప్యూటీ సీఎం చేస్తే బాగుంటుందనీ, మంత్రికి మించిన మరిన్ని అధికారులు దఖలుపడతాయనే అభిప్రాయం వ్యక్తమౌతోంది! ముఖ్యమంత్రి తరఫున మరింత కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంటుందనీ, అవసరమైతే కేబినెట్ సమావేశాలు కూడా నిర్వహించే వెసులుబాటు వస్తుందనీ పార్టీ వర్గాలు అంటున్నాయి. కేటీఆర్ విషయంలో మొదట్నుంచీ ఒక పద్ధతి ప్రకారం కేసీఆర్ అనుసరిస్తున్న వ్యూహం గమనిస్తే… డెప్యూటీ సీఎం చేసే అవకాశం ఉండొచ్చనే అభిప్రాయమే కలుగుతోంది. చూడాలి… ఈ ప్రచారం అంతిమంగా ఏమౌతుందో?