”ఎవడో కుర్రవాడు కేటీఆర్ ట్విటర్ ఖాతాలో ఒక ట్వీట్ పెట్టాడు.. అంతే కొన్ని గంటల వ్యవధిలో, ఆ కుర్రవాడు పేర్కొన్న సమస్య ఉన్న చోటకు జీహెచ్ఎంసీ అధికారులు వచ్చి చెత్తను తొలగించేసారు.”
”ఎవరో గుర్తు తెలియని వ్యక్తి కేటీఆర్ కు వాట్సప్ ద్వారా ఒక మెసేజీ పంపారు.. గంటల వ్యవధిలో ఆ సమస్య పరిష్కారం అయింది”
ఇలాంటి వార్తలు మనం దినపత్రికల్లో కోకొల్లలుగా చూస్తూ ఉంటాం. ప్రెస్రిలేషన్స్ మెయింటైన్ చేయడంలో.. ఆధునిక తరానికి చెందిన నాయకుడిగా కేటీఆర్ తెలివితేటలు అవి. మీడియా ద్వారా ఎంతగా ప్రజల్లోకి చొచ్చుకుపోవచ్చునో ఆయనకు తెలుసు. ట్వీట్లను కూడా వార్తలుగా మార్చేలా చేయడం ఆయనకు తెలుసు. ఆయన తాజాగా ఒక ట్వీట్ చేశారని హల్చల్ నడుస్తోంది. ప్రెవేటు స్కూళ్లలో ఫీజు రూపేణా పెరిగిన దోపిడీపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే అధికార్లు చాలా స్కూళ్లకు నోటీసులు ఇచ్చారు అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఆ మాత్రం ట్వీట్‌కే అందరూ మురిసిపోతున్నారు. వార్తలు హోరెత్తుతున్నాయి. అయితే ఈ ట్వీట్ ద్వారా ఫీజుల భారం మోస్తున్న తల్లిదండ్రులకు ఏం శుభవార్త లభించింది. అధికారులు నోటీసులు ప్రతి ఏడాదీ ఇస్తూనే ఉన్నారనే సంగతిని ఇక్కడ విస్మరించరాదు. ఇప్పుడేదో నోటీసులు ఇచ్చాం.. అని కేటీఆర్ ప్రకటించేసి.. అక్కడితే.. ఫీజులు తగ్గించేసినంతగా మురిసిపోమని ట్వీట్ చేస్తే కుదరదు.
కేటీఆర్ వాస్తవంగా ఈ విషయంలో కూడా తాను శ్రద్ధ పెట్టదలచుకుంటే.. ప్రెవేటు స్కూళ్లు యథేచ్ఛగా చేస్తున్న ఫీజుల దోపిడీని నియంత్రించడానికి మరింత క్రియాశీలంగా వ్యవహరించాలి. ఆ నమ్మకాన్ని దోపిడీకి గురవుతున్న తల్లిదండ్రులకు కలిగించాలి. ‘నోటీసులు ఇచ్చాం’ అంటే చాలదు ‘ఈజూన్లోగా ఫీజుల తగ్గింపు కచ్చితంగా జరుగుతుంది.. కట్టిన ఫీజులు కూడా వెనక్కువస్తాయి.. లేదా ఆ తర్వాతి టర్మ్ ఫీజులకు సర్దుబాటు అవుతుంది’ అని విస్పష్టంగా చెప్పగలిగితేనే కేటీఆర్ మాటలకు జనం దృష్టిలో మన్నన దక్కుతుంది.
అలాకాకుండా.. ఏదో ‘నోటీసులు ఇచ్చేశాం’ అని అక్కడితో పని ముగిసిపోయినట్లుగా కేటీఆర్ అనుకోకూడదు. ఈ డైలాగు.. ‘తాంబూలాలు ఇచ్చేశాం తన్నుకు చావండి’ అన్నట్లు వ్యవహరించే వందల సంవత్సరాల సాంప్రదాయ రాజకీయ కుహనా నాయకుల వైఖరినే గుర్తుకు తెస్తుంది. కేటీఆర్‌జీ.. మీరు నవీనతరం రాజకీయ ప్రతినిధిగా జనంలో నమ్మకం పెంచడానికి కాస్త కొత్త బాటలు తొక్కాలి.
We are going to regulate all private schools fees & capitation. Education dept already served notices https://t.co/iuouIenUzD
— KTR (@KTRBRS) April 14, 2016