ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ను టెన్షన్ పెడుతోంది. ప్రముఖలనదగ్గ నేతలందరూ టీఆర్ఎస్లోనే ఉన్నారు. వారి కోసం ఇతర పార్టీలు వలలేస్తున్నాయి. ప్రాధాన్యం దక్కకపోతే.. ఆ ప్రముఖ నేతలూ పార్టీలో ఉండే అవకాశం లేదు. ఇప్పటికిప్పుడు అక్కడ మంత్రి అజయ్ హవా నడుస్తోంది. సీనియర్ తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీలో ఎక్కడా కనిపించని పరిస్థితి. వీరిద్దరిపై గతంలో బీజేపీ కన్నేసిందని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో తొలి సారిగా.. మాజీ ఎంపీ పొంగులేటి ధిక్కార స్వరం వినిపించారు. పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత దక్కడం లేదని.. తన అనుచరుల్ని కూడా.. పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు ఒక్క సారిగా కలకలం రేపడంతో వెంటనే హైకమాండ్ స్పందించింది.
ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా సీనియర్ నేతల్ని ఇతర పార్టీలు పట్టుకుపోతాయనుకున్నారేమో కానీ వెంటనే పొంగులేటి సుధాకర్ రెడ్డికి నేరుగా కేటీఆర్ నుంచే కాల్ వచ్చింది. మాట్లాడుకుందాం ప్రగతి భవన్కు రమ్మని పిలుపునిచ్చారు. దీంతో పొంగులేటి తాను.. బీజేపీలో చేరడం లేదని.. పార్టీలో ఎదురవుతున్న పరిస్థితుల్నే చెప్పానని మీడియాకు చెప్పుకొచ్చారు. ఈ లోపు.. అసంతృప్తిగా ఉన్నారని భావిస్తున్న సీనియర్ నేత తుమ్మలతో కూడా… మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావు భేటీ అయ్యారు.
ఖమ్మం జిల్లాలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. హైకమాండ్ సందేశాన్ని వివరించారు. తుమ్మల కూడా కొద్ది రోజులుగా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. పాలేరులో ఆయన ఓడిపోయిన తర్వాత అక్కడ గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను టీఆర్ఎస్లో చేర్చుకుని పెత్తనం ఆయనకే ఇచ్చారు. తుమ్మల వర్గం.. ఎమ్మెల్యే వర్గానికి సరిపోలడం లేదు. ఇప్పుడు అందరికీ.. ఏవో పదవులు ఇచ్చి సంతృప్తి పరిచి.. ఎలాగోలా పార్టీలో కొనసాగే చేసే మిషన్ను కేటీఆర్ నెత్తికెత్తుకున్నారు.