తెలంగాణలో జరుగుతున్న ప్రతి ఎన్నికల్లోనూ తెరాస విజయదుందుభి మోగిస్తూ ఉండడం ఒక ఎత్తు. కానీ ఆ పార్టీలో అంతర్గత రాజకీయాలు కూడా క్రమంగా ముదిరి పాకాన పడుతున్నట్లు వాతావరణం కనిపిస్తోంది. పైకి అంతా నివురుగప్పిన నిప్పులా ఉన్నప్పటికీ.. లోలోపల మంత్రులు, కేటీఆర్ కొడుకు, అల్లుడు కోటరీ లమధ్య విభేదాలు దాదాపు స్పష్టంగానే బయటపడిపోతున్నాయి. గ్రేటర్ ఎన్నికల విషయంలో బావ హరీష్‌రావును… ప్రచారంలో ఏమాత్రం భాగం కానివ్వకుండా దూరం ఉంచిన బామ్మర్ది తారక రామారావు.. ఇప్పుడు నారాయణఖేడ్ ఎన్నికను తాను పట్టించుకోవడం అక్కర్లేదని ఫిక్సయినట్లుగా కనిపిస్తోంది. ఇక్కడ ఖేడ్ ఎన్నిక ముదిరి పాకాన పడుతున్న తరుణంలో ఆయన ఎంచక్కా ముంబాయి టూర్ ప్లాన్ చేసుకున్నారు. అలా అనడం కంటె.. ఖేడ్ ఎన్నికను బావ హరీష్ రావు ఖర్మానికి వదిలేశారంటే అతిశయోక్తి కాదు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్నికల ఫలితాలు ఎలాగైనా వచ్చి ఉండొచ్చు గాక.. కానీ ఆ ఎన్నికల పర్వం ముగిసిన వెంటనే అన్ని పార్టీలకు చెందిన కీలక నాయకులంతా ఇప్పుడు మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే స్థానం ఉప ఎన్నిక మీద దృష్టి పెట్టారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల్లోని కీలక నాయకులంతా ఇప్పుడు నారాయణఖేడ్ ప్రచార పర్వంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. సాధారణంగా ఏ పార్టీలో అయినా ఇలాగే జరుగుతుంది. గ్రేటర్ లో ఓడిపోయాం కదాని.. నాయకులు ఇళ్లలో కూర్చుండిపోరు. ఆ తర్వాతి ఎన్నికలకు సిద్ధమైపోతుంటారు. అయితే ఒక్క తెరాసలో మాత్రమే భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. గ్రేటర్లో అన్నీ తానే అయి ప్రచారాన్ని నడిపించిన కేటీఆర్.. నారాయణఖేడ్ జోలికి వెళ్లలేదు.
13వ తేదీన ఇక్కడ ఎన్నిక జరగబోతోంది. మరో రెండు రోజుల్లో ప్రచారం ముగుస్తుంది. కానీ.. గ్రేటర్ రిజల్ట్ వచ్చేసిన వెంటనే.. తన విజయం పూర్తయిపోయింది.. మిగిలిన ఎన్నికలు ఎలా పోతే నాకేంటి అనే తరహాలో కేటీఆర్ ముంబాయి టూర్‌కు వెళ్లి.. అక్కడ కార్పొరేట్ కంపెనీలనుంచి తెలంగాణకు ఆర్థిక సహకారాన్ని రాబట్టే ప్రయత్నంలో నిమగ్నం అయిపోయారు.
బావామరదుల మధ్య ఉన్న ఆధిపత్య పోరాటానికి ఇది కూడా ఒక నిదర్శనమే అనే వ్యాఖ్యలు పార్టీలోనే వినిపిస్తున్నాయి. ‘గ్రేటర్లో తాను ప్రూవ్ చేసుకున్నాడు, ఖేడ్‌లో బావ హరీష్ ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాలి’ అనే ధోరణితోనే అక్కడ తాను వేలు పెట్టకూడదని కేటీఆర్ భావించారేమో అనుకుంటున్నారు. అయినా.. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఆయన రూరల్ నియోజకవర్గం అయిన నారాయణఖేడ్‌లో ప్రచారానికి వెళితే.. ఆయన ఇచ్చే హామీలకు ఖచ్చితంగా విలువ ఉంటుంది. కానీ ఆయన ఆ జోలికి వెళ్లడం లేదని సమాచారం. బావామరదుల్లో ఎవరి సామ్రాజ్యానికి వారు గిరిగీసుకుని, ఆ గిరి ఇతరులను దాటనివ్వకుండా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది.