బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారిన తర్వాత ఢిల్లీలో కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నారు. దీనికి కీలక నేతలందరూ హాజరు కావాలని ఆదేశించారు. రెండు రోజుల ముందుగానే మంత్రులందరూ ఢిల్లీకి చేరుకున్నారు. ఈ కీలక ప్రోగ్రాంకు.. కేటీఆర్ దూరంగా ఉన్నారు. టీఆర్ఎస్ కు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్… ఇప్పుడు కూడా ఆ పార్టీకి అధికారికంగా వర్కింగ్ ప్రెసిడెంటే. అయినప్పటికీ ఆయన ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి దూరంగా ఉన్నారు. హైదరాబాద్లో ముఖ్యమైన సమావేశాలు ఉన్నందునే వెళ్లడం లేదని కేటీఆర్ చెబుతున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవం కన్నా ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటాయా అని టీఆర్ఎస్లోనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కల్వకుంట్ల కవిత మాత్రం ఒక రోజు ముందుగానే ఢిల్లీ చేరుకున్నారు. ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ గురించి ఆమె మాత్రమే మాట్లాడుతున్నారు. కేటీఆర్ పెద్దగా స్పందించడం లేదు. ఈ కారణంగా కేసీఆర్ ఫ్యామిలీలో బీఆర్ఎస్ విషయంపై ఏదో అంతర్గత చర్చ నడుస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కేటీఆర్ తెలంగాణకు పరిమితమని.. కవితను.. జాతీయ రాజకీయాల్లో కీలకం చేయాలనుకంటున్నారని.. చెబుతున్నారు. అందుకే కేటీఆర్ బీఆర్ఎస్ ఆఫీస్ ప్రారంభానికి దూరంగా ఉన్నారని భావిస్తున్నారు.
గతంలోనే పార్టీ, ప్రభుత్వం పదవుల విషయంలో కేటీఆర్, కవిత మధ్య విబేధాలొచ్చాయని విస్తృతంగా ప్రచారం జరిగింది. కొంత కాలం పాటు టీఆర్ఎస్ అధికారిక పత్రికలో కవిత పేరు కూడా కనిపించలేదు. తర్వాత అంతా సర్దుకున్నట్లుగా భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో వారిద్దరి మధ్య గ్యాప్ ఉన్నట్లుగా పెద్దగా ఘటనలు బయటకు రాలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ జాతీయ రాజకీయాలను కవితకు.. తెలంగాణ రాజకీయాలు కవితకు అప్పజెప్పడం ద్వారా కేసీఆర్ సమస్యను పరిష్కరించారని అంచనా వేస్తున్నారు.