మున్సిపల్ ఎన్నికల తేదీలు వచ్చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలు వచ్చాయంటే అధికార పార్టీ తెరాస వ్యూహం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా పకడ్బంధీ వ్యూహాలతో ఆ పార్టీ సిద్ధమౌతూ ఉంటుంది. ఈసారి మున్సిపోల్స్ కూడా అదే తరహాలో ఎదుర్కొనడానికి సిద్ధమౌతోంది. బలపడాలని భాజపా, ఉనికి చాటుకోవాలని కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలే చేస్తాయి. వాటికి ధీటుగా తెరాస వ్యూహాలుండాలి. ఈసారి మున్సిపల్ ఎన్నికల బాధ్యత అంతా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కి అప్పగించినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. తిరిగిరాగానే ఆయన మున్సిపోల్స్ పై దృష్టి పెడతారని తెరాస వర్గాలు అంటున్నాయి. అభ్యర్థుల ఎంపిక దగ్గర్నుంచీ ప్రచారం వరకూ అన్నీ తానై చూసుకుంటారని తెలుస్తోంది.
ఈనెల 27న హైదరాబాద్ కి చేరుకోనున్న కేటీఆర్, అదే రోజున మున్సిపల్ ఎన్నికలపై పార్టీ నేతలతో రివ్యూ పెడుతున్నారు. నిజానికి, ఇప్పటికే జిల్లాలవారీగా పార్టీ పరిస్థితి ఎలా ఉందీ, అభ్యర్థులను ఎవర్ని నిలబెడితే బాగుంటుందనే అంశంపై సర్వే చేయించుకున్నట్టు సమాచారం. భాజపా బలంగా ఉన్న కొన్ని మున్సిపాలిటీలున్నాయనీ, వాటిపై కేటీఆర్ ప్రత్యేక దృష్టిపెడతారనీ, ఇతర ప్రాంతాల బాధ్యతల్ని మంత్రులూ ఎమ్మెల్యేలకు అప్పగిస్తారని తెలుస్తోంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు, రామగుండంతోపాటు నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లలో ఆయనే స్వయంగా ప్రచారం నిర్వహించబోతున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
మున్సిపల్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారం చేయడం అనుమానమే అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు అభిప్రాయపడ్డట్టు సమాచారం. ఈ ఎన్నికల సీన్లోకి ముఖ్యమంత్రి రారనీ, అంతా కేటీఆర్ ఒక్కరే చూసుకుంటారని అంటున్నారు. ప్రచార సభల్నీ కేవలం కేటీఆర్ ఒక్కరే నిర్వహిస్తారనీ అంటున్నారు. ఇందులో వాస్తవమూ లేకపోలేదు! పార్టీ బాధ్యతలు మొత్తాన్ని కేటీఆర్ మీద వదిలేయడం… ఒక భవిష్యత్తు అవసరం. ఇక, ముఖ్యమంత్రి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రచారానికి వెళ్తే… ఏం సాధించారని వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలకు దిగే అవకాశమూ ఉంది. అలాగని వాటిని సీఎం కేసీఆర్ తిప్పికొట్టలేరని కాదు. మున్సిపోల్స్ బాధ్యతలు మొత్తంగా కేటీఆర్ భుజాల మీదే ఉంచితే ఉభయతారకంగా ఉండే అవకాశం కనిపిస్తోంది కదా! చూడాలి.. ఈ ఎన్నికల్ని తెరాస ఎలా ఎదుర్కొంటుందో?