మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ప్రతిష్టించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకోసం రౌండ్ టేబుల్ సమావేశాలను కూడా నిర్వహించారు. యూపీఎఫ్ అనే సంస్థను ఏర్పాటు చేసి కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. వీటికి బీఆర్ఎస్ నుంచి కనీస మద్దతు కరువైంది. కవిత మద్దతుదారులు, రాజకీయ ఆశ్రయం కోసం పాకులాడే నేతలు మినహా బీఆర్ఎస్ పెద్ద నేతలెవరూ ఆమె చేపట్టిన కార్యక్రమాల్లో పాల్గొనలేదు. కానీ, లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన తర్వాత కవిత ఉద్యమం గురించి కేటీఆర్ మాట్లాడటం నవ్వులు తెప్పిస్తోంది.
మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహ ఏర్పాటుపై కవిత ఉద్యమం బీఆర్ఎస్ ను వేలెత్తి చూపేదిలా ఉందన్న వాదనలు ఆ పార్టీలోనే ఉన్నాయి. పదేళ్ళు అధికారంలో ఉండి ఫూలే విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని కౌంటర్లు ఉంటాయని అందుకే కవిత లేవనెత్తిన ఈ అంశంపై బీఆర్ఎస్ సైలెంట్ గా ఉన్నట్టు తెలిసింది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కవిత ఈ అంశంపై మాట్లాడారు. కానీ, కవిత గొంతుకు ఆ పార్టీ నుంచి ఎవరూ కోరస్ ఇవ్వలేదు. ఒక్కరంటే ఒక్కరు కూడా కవిత డిమాండ్ కు మద్దతు ఇస్తున్నట్లు కనీసం ఓ ప్రకటన కూడా చేయలేదు. గురువారం మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా బీఆర్ఎస్ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు.
మహాత్మా జ్యోతిబాఫూలే స్పూర్తితో కేసీఆర్ ముందుకు సాగారని..ఆయన విగ్రహాన్ని ఏర్పాటు కోసం కవిత పోరాడిందని కేటీఆర్ కామెంట్స్ చేశారు.ఈ వ్యాఖ్యలే ఇప్పుడు చర్చకు దారి తీస్తున్నాయి. కవిత అరెస్ట్ కు ముందు.. ఈ అంశంపై ఆమె మాట్లాడితే కనీసం మాటవరుసకు మద్దతు ఇవ్వని వాళ్ళు…ఆమె అరెస్ట్ అయ్యాక అదే అంశంపై మాట్లాడటం ఏంటని కవిత వర్గం ప్రశ్నిస్తోంది.