సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో ఒక్కరంటే ఒక్కరు కూడా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆటగాళ్లు లేరని… ముఖ్యంగా హైదరాబాద్‌కు చెందిన ఆటగాళ్లు ఎవరూ లేరని అందరూ విమర్శలు చేస్తూంటే… మంత్రి కేటీఆర్ మాత్రం.. భిన్నమైన కోణాన్ని ఆవిష్కరిస్తూ.. బీసీసీఐకి.. ఐపీఎల్ గవర్నింగ్ బాడీకి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో హైదరాబాద్ ఆటగాళ్లకుప్రాధాన్యం ఇవ్వమని కోరలేదు. అసలు ఐపీఎల్ టోర్నీ హైదరాబాద్‌లో నిర్వహించాలని కోరారు.ఐపీఎల్ సీజన్ కోసం బీసీసీఐ ఆరు నగరాలను పరిశీలిస్తోంది.
ఢిల్లీతోపాటు ముంబై, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్ ఉన్నాయి. బోర్డు పరిశీలనలో హైదరాబాద్ పేరు లేదు. దీంతో ఐపీఎల్ మ్యాచ్‌లు హైదరాబాద్‌లో జరగడం సాధ్యం కాదు. కరోనా కారణంగా ఆతిధ్య స్టేడియాల ఫార్ములా మార్చుతున్నారు. దీంతో హైదరాబాద్ లేకపోవడతో.. పెద్ద ఎత్తున ఆదాయం కూడా ప్రభుత్వం కోల్పోయే అవకాశం ఉంది. దీంతో కేటీఆర్ రంగంలోకి దిగారు.వచ్చే ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్‌ను కూడా ఒక వేదికగా చేయడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. దేశంలో కరోనా తక్కువగా ఉన్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి అని కేటీఆర్ చెబుతున్నారు.
ఐపీఎల్ నిర్వహణకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని ఆయన ట్వీట్లో చెప్పుకొచ్చారు. హైదరాబాద్ ఆటగాళ్ల అంశంపై ఇప్పటికే టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీంపై విమర్శలు చేశారు. జట్టు పేరు మార్చుకోవాలన్నారు. అందే కాదు… కెప్టెన్ వార్నర్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు చేశారు. ఇది క్రికెట్ వర్గాల్లో సహజంగానే అలజడి రేపింది. ఇలాంటి సమయంలో… కేటీఆర్.. ఆటగాళ్ల ప్రాతినిధ్యం గురించి ప్రస్తావించకుండా… ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సహకారానికి హామీ ఇస్తూ ట్వీట్ చేశారు.