కేటీఆర్ యూట్యూబ్ చానళ్లను చూసి భయపడిపోతున్నారు. గతంలో తమ ఓటమికి తమకు యూట్యూబ్ చానళ్లు లేకపోవడమే కారణమని ఫీలయ్యారు. ఆ తర్వాత ఇటీవల తమను యూట్యూబ్ చానళ్లు టార్గెట్ చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. యూట్యూబ్ చానళ్లలో జరుగుతున్న ప్రచారం, థంబ్ నెయిల్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గతంలో ట్వీట్ పెట్టారు. ఇప్పుడు ఏకంగా నోటీసులు పంపించారు.
తమపై దురుద్దేశంతో దుష్ప్రచారం చేస్తున్నారని టీవీ, సోషల్ మీడియా ఛానెల్స్‌కు లీగల్ నోటీసులు పంపారు. తనకు సంబంధం లేని విషయాల్లో తన పేరు, ఫొటోలు ప్రస్తావిస్తున్న ప్రతి మీడియా సంస్థ, యూట్యూబ్ ఛానెల్‌పైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటానని, పరువు నష్టం కేసులు పెడతానని కేటీఆర్ హెచ్చరించారు. ఇప్పటికైనా తమకు, వారి కుటుంబానికి సంబంధం లేని విషయాల్లో దురుద్దేశపూరితంగా ప్రచారం చేస్తున్న వీడియోలను వెంటనే తొలగించాలని వారికి పంపిన లీగల్ నోటీసుల్లో కేటీఆర్ సూచించారు.
పక్కా ప్రణాళిక ప్రకారం ఈ ఛానళ్లు, మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని కేటీఆర్ తన లీగల్ నోటీసులో పేర్కొన్నారు. కుట్ర, ఎజెండాలో భాగంగా తనపై జరుగుతున్న ప్రచారాన్ని చట్టపరంగా ఎదుర్కొంటానని కేటీఆర్ అన్నారు. తమకు సంబంధం లేని అనేక విషయాల్లో తమ పేర్లు, ఫొటోలను ఉపయోగించుకుని చెత్త థంబ్‌నెయిల్స్ పోస్ట్ చేస్తున్న ఈ ఛానళ్లపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు.
కేటీఆర్ తీరుపై బీఆర్ఎస్ లోనూ ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. చివరికి తన సొంత పత్రికలో చంద్రబాబు, రేవంత్ భేటీ అంటూ.. తప్పుడు వార్తలు రాయించి.. బీఆర్ఎస్ యూట్యూబ్ చానళ్లలో ప్రచారం చేయించిన విషయాన్నీ కొంత మంది గుర్తు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా గతంలో ఏం చేసిందో.. అంత కన్నా తక్కువే ప్రస్తుతం ఇతర యూట్యూబ్ చానల్స్ చేస్తున్నాయి. వ్యూస్ కోసం … ఎవరు ట్రెండింగ్ లో ఉంటే వారిపై థంబ్ నెయిల్స్ తో విరుచుకుపడుతూంటాయి. అలాంటి వాటిని కట్టడి చేయడం సాధ్యం కాదని కేటీఆర్‌కూ తెలిసే ఉంటుంది. కానీ బెదిరించాలన్న ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. కానీ అది రివర్స్ అయ్యే అవకాశమే ఎక్కువ.