తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. చాలా మందికి సాయం చేస్తూంటారు. విపక్షాలతో పాటు మోదీపైనా విమర్శలకు వాడుకుంటూ ఉంటారు. అయితే రాజకీయ పరమైనవే అయినా… విధానపరంగా ఆ విమర్శలు ఉండేలా చూసుకుంటారు. కానీ ఈ రోజు మాత్రం తెలంగాణ ఉద్యమం అంతా తమ క్రెడిటేనని ఇప్పుడు తెలంగాణలో ఉన్న రాజకీయ నేతలు ఉద్యమంలో ఎక్కడ ఉన్నారంటూ ఓ ట్వీట్ చేశారు. దీనికి సందర్భం.. సాగరహారం ఆందోళనకు పదేళ్లు పూర్తి కావడం ఇసుకేస్తే రానంత జనం మధ్య జరిగిన ఆ ఆందోళన ఓ చరిత్ర. అయితే దీన్ని కేటీఆర్ పూర్తిగా తమకే అన్వయించుకోవడంతోనే వివాదం ప్రారంభమయింది.
కేటీఆర్ ట్వీట్‌కు వెంటనే రేవంత్ రెడ్డి స్పందించారు. సాగరహారం సక్సెస్ కావడానికి క్రెడిట్ మొత్తం టీఆర్ఎస్ తీసుకుంటోందని కానీ.. తెలంగాణ ఉద్యమం మొత్తం జేఏసీ ఆధ్వర్యంలో సకల జనులు చేశారని గుర్తు చేశారు. ఎవని పాలయిందిరో తెలంగాణ అంటూ ట్వీట్లు పెడుతున్న ఆయన.. ఇప్పుడు .. ప్రజలు ఉద్యమం చేస్తే ఆ ఫలాలను కల్వకుంట్ల కుటుంబం అనుభవిస్తోందని ఇప్పుడు ఉద్యమం క్రెడిట్ కూడా తమకే సొంతం అన్నట్లుగా చేస్తోందని విమర్శలు గుప్పించారు. ఉద్యమ సమయంలో తాము చేసిన పోరాటాల్ని గుర్తు రేవంత్ గుర్తు చేశారు.
నిజానికి తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక్క జగ్గారెడ్డి తప్ప అందరూ ప్రత్యేక రాష్ట్రానికి మద్దతు తెలిపారు. తమ పార్టీలు.. ఏపీలో ఇబ్బందికరం అవుతుందని తటపటాయిస్తున్నా.. తాము మాత్రం ఉద్యమంలోకి దిగారు. అందరూ పోరాడారు. ఆ పోరాటానికి కోదండరాం నేతృత్వంలోని జేఏసీ నాయకత్వం వహించింది. కానీ దాని వల్ల లాభం పొందింది మాత్రం టీఆర్ఎస్. తెలంగాణ ఏర్పడిన తర్వాత జేఏసీ ఆచూకీ లేదు.. కానీ.. ఉద్యమం అంతా తామే నడిపామన్నట్లుగా టీఆర్ఎస్ మాత్రం జోరుగా ప్రచారం చేసుకుంటోంది. దీనిపై విపక్షాలు విమర్శలు చేస్తూంటాయి… కానీ ఇప్పుడు హవా టీఆర్ఎస్దే కాబట్టి వారి వాయిస్ ప్రజల్లోకి వెళ్లదు.