గ్రేటర్ హైదరాబాద్ పోలింగ్ సందర్భంగా పాతబస్తీలో జరిగిన అరాచకాలు అందరికీ ఆశ్చర్యం, ఆందోళన కలిగించాయి. మళ్లీ మజ్లిస్ మార్క్ ఇష్టారాజ్యం మొదలైందా అని నగర పౌరులు భయపడ్డారు. పాతబస్తీ అంటే ప్రత్యేక రాజ్యం, ఇతర పార్టీలు రావద్దనే తరహాలో దాడులు జరిగాయి. వీటిపై ప్రతిపక్షాలు మండిపడటం సహజం. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. ఆశ్చర్యకరంగా, మంత్రి కేటీఆర్ మాత్రం ప్రతిపక్షాలనే నిందించారు.
ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయనే మాటకు అర్థం ఆయనకు తెలుసో లేదో? దెబ్బలు తిన్న వారికి, బాధ అనుభవించిన వారికి తెలుస్తుంది. దాని తీవ్రత ఏమిటో. ఏసీ కార్లలో పూర్తి సెక్యూరిటీతో తిరిగే వారికి ఆ బాధ తెలియదు. ఓ జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి అయిన ఉత్తం కుమార్ రెడ్డిపై జరిగిన దాడి, ఎంపీ అసదుద్దీన్ కనుసన్నల్లో జరిగిన అరాచకం మామూలు విషయమా? మాజీ మంత్రి షబ్బీర్ అలీ కారు డోరును లాగేసి ఆయన్ని తన్నిన కార్యకర్తను అరెస్టు చేయకుండా పోలీసులు మీనమేషాలు లెక్కిస్తున్నా ప్రతిపక్షాలు నోరు మూసుకుని ఉండాలా? పోలీస్ స్టేషన్ దగ్గరే ఇంతటి హింసాత్మక దాడులు జరగడం విస్మయకరం. ఇది పూర్తిగా పోలీసుల వైఫల్యం. పరోక్షంగా ప్రభుత్వ వైఫల్యం. కాబట్టే ప్రభుత్వం విఫలమైందని విపక్షాలు విమర్శించాయి. సెక్షన్ 8 అమలు చేయాలని డిమాండ్ చేశాయి.
ప్రతిపక్షాల రాద్ధాంతం వల్ల హైదరాబాద్ ఇమేజి దెబ్బతింటుదని కేటీఆర్ వింత వాదన వినిపించారు. మజ్లిస్ కార్యకర్తలు, వారి పేరుతో రౌడీలు దాడులుచేస్తే హైదరాబాద్ ఇమేజి పెరుగుతుందా? చాంద్రాయణ గుట్టలో బీజేపీ వారిని రక్తం కారేలా కొడితే సిటీ ఇమేజి పెరుగుతుందా? ఉపముఖ్యమంత్రి ఇంటిమీదే దాడి చేస్తే హైదరాబాద్ ఇమేజి పెరుగుతుందా? ఉప ముఖ్యమంత్రి కొడుకును మజ్లిస్ ఎమ్మెల్యే కొడితే నగర ఇమేజి పెరుగుతుందా? తెరాస వారిమీద దాడి చేస్తే ఇమేజి పెరుగుతుందా? వీటికి కేటీఆర్ జవాబు చెప్పకుండా, కడుపులో చల్ల కదలకుండా ప్రతిపక్షాలపై విమర్శలు చేసేశారు.
ఒవైసీ సోదరులు, మజ్లిస్ నాయకులు రోజంతా పాతబస్తీలో స్వైరవిహారం చేశారు. పోలింగ్ పర్యవేక్షణ పేరుతో అధికారులను బెదిరించారని మీడియా వెల్లడించింది. ఎదురు మాట్లాడితే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి చాలా చోట్ల మజ్లిస్ వారు రిగ్గింగ్ చేసినా అధికారులు మౌనం వహించారని వార్తలు వచ్చాయి. 21వ శతాబ్దంలోనూ మజ్లిస్ పార్టీ వారు మధ్య యుగాల నాటి తరహాలో అరాచక దాడులు చేసినా పోలీసులు కిమ్మనకపోవడానికి కారణం, అది కేసీఆర్ కు కావాల్సిన పార్టీ. అది తమకు మిత్రపక్షమని కేసీఆర్ చాలా స్పష్టంగా మరోసారి ప్రకటించారు. కాబట్టి పోలీసులు చేతులు ముడుచుకుని కూర్చున్నారు. 24 గంటలు గడిచినా ఏ ఒక్కరినీ అరెస్టు చేయలేదు. కేసులు మాత్రం నమోదు చేశారు. వారిమీద ఎన్నికేసులున్నాయో బహుశా వారికే లెక్క తెలియదేమో? అరెస్టు చేయకుండా కేసులు పెట్టి ఏం లాభం?
ముందు ముందు మజ్టిస్ పార్టీ వారు ఏం చేసినా నగర పౌరులు నోరు మూసుకోవాలనేదే కేసీఆర్ అండ్ ప్యామిటీ ఉద్దేశమైతే అది మన దౌర్భాగ్యం. తెరాసకు ఓటేస్తే మజ్లిస్ అరాచకాలకు ఓటు వేసినట్టే అన్న బీజేపీ మాటలు నిజమేనని స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఐదేళ్ల పాటు హైదరాబాద్ ఎలా ఉండబోతోందో అప్పుడే శాంపిల్ చూపించారు. ఈ అరాచకాల మధ్య బతకలేం అనుకున్న వారు మరోచోటికి వలస పోవాలేమో?