ఎన్నికల ఫలితాలు వచ్చి మూడు నెలలు దాటిపోతున్నా ఇంకా రియాలిటీలోకి రాలేకపోతున్నారని సొంత పార్టీలోనే సెటైర్లు పడుతున్నాయి. నియోజకవర్గాల సమీక్షల పేరుతో జిల్లాలకు వెళ్తున్న ఆయన.. పార్టీ నేతలకు ఒకటే చెబుతున్నారు. తాము ఎంతో చేశాము కానీ కాంగ్రెస్ ఇచ్చిన హామీలకే తమను ఓడించారని.. అంటున్నారు. గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్, బీజేపీ మాయమాటలు నమ్మి మోసపోయారనే చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో తాము ఇచ్చిన హామీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీకి మార్చి 17 నాటికి వంద రోజులు నిండుతాయని, ఆ తర్వాత మనమంతా జనాల్లోకి వెళ్లి ఇచ్చిన హామీలు ఎందుకు అమలుకాలేదో నిలదీద్దామని అంటున్నారు.
కేటీఆర్ మాటలు వింటూంటే.. మార్చి పదిహేడో తేదీన కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయలేదు కాబట్టి రాజీనామా చేయాలని డిమాండ్ చేసేలాగున్నారని సెటైర్లు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంపై మూడు నెలల్లోనే ప్రజలు తిరుగుబాటు చేసి.. . మీరు అవసరం లేదు.. మాకు బీఆర్ఎస్ కావాలని ప్రజలు కోరుకుంటారని కేటీఆర్ ఆశపడుతున్నట్లుగా ఆయన మాటలు ఉంటున్నాయని ఎవరికైనా అర్థం అవుతుంది. తమ ప్రభుత్వం ఊహించనంతగా చేసిందని ఆయన అనుకుంటూ ఉండవచ్చు కానీ.. ఇలా ప్రతీ దానికి.. ప్రజలు మోసోపోయారని చెప్పుకుంటూ తిరిగే ప్రయోజనం ఏముంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఇప్పటికే ఐదు గ్యారంటీలు అమల్లోకి తెచ్చామని.. మరో గ్యారంటీని ఈ రోజు అమల్లోకి తెస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. దమ్ముంటే ఒక్క లోక్ సభ సీటు తెచ్చుకోవాలని రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నారు. నిజానికి బీఆర్ఎస్ పాలనపై వ్యతిరేకత లేకపోతే… ఎమ్మెల్యే అభ్యర్థులపై వ్యతిరేకత వల్లనే ఓడిపోయి ఉంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మరింత బలం గా కనిపించాల్సి ఉంది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఉనికికే సవాల్ ఏర్పడింది. దీన్ని కేటీఆర్ అధిగమించే ఆలోచన చేయాలి కానీ.. పదే పదే ప్రజలు …తమనే కావాలనుకుంటున్నారని అనుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదనేది ఎక్కువ మంది అభిప్రాయం.