కర్ణాటకలో కాంగ్రెస్‌కు కేటీఆర్ పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని తన ట్వీట్ల ద్వారా చెప్పకనే చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ గెలవాలని అక్కడి సమస్యలన్నీ తొలగిపోవాలని కేటీఆర్ ఇండైరక్ట్‌గా కోరుకున్నారు. అసలేం జరుగుతోందంటే ఇటీవల కేటీఆర్ బెంగళూరును టార్గెట్ చేస్తున్నారు. గతంలో అక్కడ ఇద్దరు స్టాండప్ కమెడియన్ల షోలను రద్దు చేశారు. అప్పుడు హైదరాబాద్‌లో అలాంటి ఇబ్బంది లేదని వారిని కేటీఆర్ ఆహ్వానించారు. ఆ తర్వాత బెంగళూరులో మౌలిక సదుపాయాల ఇబ్బందులపై పలుమార్లు పారిశ్రామికవేత్తల సమావేశాల్లో చర్చించారు. ఇటీవల అమెరికా పర్యటనలోనూ బెంగళూరులో అనేక సమస్యలు ఉన్నాయని ఐటీ కంపెనీలకు హైదరాబాద్ మాత్రమే డెస్టినేషన్ అని ప్రసంగించారు.
బెంగళూరు మైనస్‌లనే ఎక్కువగా గుర్తు చేశారు. అదే సమయంలో ఇటీవల ఖాతాబుక్ అనే సంస్థ సీఈవో బెంగుళూరు ట్రాఫిక్ దగ్గర్నుంచి చాలా సమస్యలపై అసహనంతో ట్వీట్ పెట్టారు. వెంటనే కేటీఆర్ బ్యాగులు సర్దుకుని హైదరాబాద్ రావాలని సూచించారు. ఇది కలకలం రేపింది. ఈ ట్వీట్ ను ఉద్దేశించి కర్ణాటక పీసీసీ చీఫ్ శివకుమార్ మీ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నామని, 2023లో కర్నాటకలో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, మళ్లీ బెంగుళూరుకు పూర్వ ఐటీ వైభవాన్ని తీసుకు వస్తామని ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.
‘‘శివకుమార్ అన్నా.. ఎవరు గెలుస్తారో చెప్పలేను. కానీ మీరు విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నా.. దేశ యువత, భవిష్యత్తు కోసం ఉద్యోగాల కల్పన ద్వారా హైదరాబాద్, బెంగుళూరు నగరాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. ఐటీ, బీటీలపై ఫోకస్ పెడదాం. కానీ హలాల్, హిజాబ్ లాంటి అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు’’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ రిప్లయ్ ఇచ్చారు. నిజానికి కర్ణాటకలో బీజేపీ హలాల్ , హిజాబ్ వివాదాలతో రాజకీయం చేస్తోంది. మొత్తంగా అక్కడి అధికారంలో ఉన్న బీజేపీ బెంగళూరు ఇమేజ్ను దెబ్బతీస్తోందని కేటీఆర్ అంటే.. అవును ..తాము వచ్చి బాగు చేస్తామని కాంగ్రెస్ అంటోంది.ఈ పొలిటికల్ గేమ్‌ను కర్ణాటక బీజేపీ బిత్తరపోయి చూస్తోంది.