కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అధికార పార్టీ తెరాసలో చేరతారా అంటే… ఎప్పటికైనా ఆయన ప్రయాణం అటువైపే అనే సమాధానం వినిపిస్తోంది! గత కొన్ని నెలలుగా ఆయన తీరు అలానే ఉంటోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి పథకాలు శెభాష్ అంటారు, రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర తీసుకొస్తే కేసీఆర్ కి గుడి కడతానని ప్రకటిస్తారు! ఏదేమైనా, చివరికి ఆయన తెరాసలో చేరతారనే నమ్మకం కాంగ్రెస్ నేతలతోపాటు, తెరాస నేతల్లో కూడా బలంగానే ఉంది. ఓరకంగా చెప్పాలంటే… తెరాసకు ఆయన్ని చేర్చుకోవాల్సిన రాజకీయ అవసరమూ ఉందనే చెప్పాలి! ఎలా అంటే… ఉమ్మడి మెదక్ జిల్లాలో అన్ని నియోజక వర్గాల్లోనూ తెరాస జెండా ఎగరెయ్యాలనుకున్నారు. కానీ, సంగారెడ్డి సాధ్యం కాలేదు. జగ్గారెడ్డిని చేర్చేసుకుంటే ఆ లక్ష్యం పూర్తయినట్టే!
ఇప్పుడు ఇదే గుబులు స్థానిక తెరాస వర్గాల్లో ఉందని సమాచారం! 2014 ఎన్నికల్లో జగ్గారెడ్డిపై తెరాస అభ్యర్థి చింతా ప్రభాకర్ గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. కానీ, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీన్ రివర్స్ అయి… ప్రభాకర్ మీద జగ్గారెడ్డి గెలిచారు. గడచిన పదేళ్లుగా ఈ ఇద్దరూ రెండు పార్టీల నుంచీ పోటాపోటీగా తలపడుతూ, రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. అయితే, ఈ మధ్య తెరాసలోకి జగ్గారెడ్డి కూడా చేరతారు అనే చర్చ మొదలైన దగ్గర్నుంచీ చింతా వర్గానికి టెన్షన్ మొదలైందని సమాచారం! అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా… చింతా ప్రభాకర్ తోపాటు ఆయన ముఖ్య అనుచరులకు తెరాస నుంచి గుర్తింపు లభిస్తుందనీ, లోక్ సభ ఎన్నికల ఫలితాల తరువాత తెరాస అధినాయకత్వం న్యాయం చేస్తుందనే ఆశతో ఉన్నారు. అయితే, జగ్గారెడ్డి పార్టీలో చేర్చుకుంటే… కొన్నాళ్లుగా పార్టీని నమ్ముకుని ఉంటున్న తమకు వచ్చే అవకాశాలకు ఆయన గండికొట్టే అవకాశం ఉందనే ప్రచారం ఇప్పుడు చింతా వర్గంలో ఉందట!
జగ్గారెడ్డిని తెరాసలో చేర్చుకోవద్దనీ, ఆయన పార్టీలో చేరితే స్థానికంగా పరిస్థితులు మరోలా పరిణమిస్తాయనే అంశాన్ని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు చింతా అనుచరులు చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. సామాజిక మాధ్యమాలు కేటీఆర్ కు చాలా సందేశాలు వెళ్తున్నాయని తెలుస్తోంది. నిజానికి, జగ్గారెడ్డి చేరికపై ఇంకా స్పష్టత లేదు. ఆయన తీరు కూడా అంతే గందరగోళంగా ఉంది. విచిత్రం ఏంటంటే…. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలు వెళ్లిపోతే ఎలా అనే ఆందోళన ఆ పార్టీలోఎంత ఉందో, తెరాసలో కూడా అదే టెన్షన్ కనిపిస్తోంది! కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెరాసలోకి వచ్చి చేరితే… తమ పరిస్థితి ఏమౌతుందనే ఆందోళన తెరాస నేతల్లో కూడా వ్యక్తమౌతోంది.