తెలంగాణ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది. తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించడం.. ప్రభుత్వం ప్రారంభించిన మన ఊరు – మన బడి కార్యక్రమానికి విరాళాలు సేకరించే లక్ష్యంతో కేటీఆర్ అమెరికాలో పర్యటించారు. వారం రోజులకుపైగా సాగిన టూర్లో ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. అనేక మల్టినేషనల్ కంపెనీలు హైదరాబాద్లో కొత్తగా పెట్టుబడులు పెట్టడమో.. లేకపోతే ఇప్పటికే ఉన్నవాటిని విస్తరించడమో చేసేందుకు ఆసక్తి చూపించాయి.
అయితే కేటీఆర్ పర్యటనలో అన్నీ ప్రాధమిక మాటలే జరిగాయి. ఎలాంటి ఒప్పందాలు జరగలేదు. వీటిని ప్రభుత్వం తరపున పక్కాగా ఫాలో అప్ చేసుకుంటే పెట్టుబడులు మెటీరియలైజ్ అవుతాయి. హైదరాబాద్కు మరిన్ని అగ్రశ్రేణి సంస్థలు వచ్చినట్లవుతుంది. పెట్టబడుల ఆకర్షణ విషయంలో కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు కాబట్టి అమెరికా పర్యటన సక్సెస్ అయి నట్ల అనుకోవాలి .
అలాగే స్కూళ్లను అభివృద్ధి చేయాడాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. తెలంగాణకు చెందిన ఎన్నారైలు తమ స్వగ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు ముందుకు రావాలని, తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చేందుకు అమెరికా వెళ్లారు. అమెరికాలో స్థిరపడిన తెలంగాణ వాసులు .. బాగా స్పందించారు. వీలైనంత ఎక్కువగా స్కూళ్ల రూపురేఖలను విరాళాలతో మార్చే లక్ష్యం నేరవేరే అవకాశం కనిపిస్తోంది.