హైదరాబాద్ లో సీమాంధ్రులను ఆకర్షించడాన్ని ఒక మిషన్ గా పెట్టుకుని సమావేశాలు నిర్వహిస్తున్నారు ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్. సంఘీభావ సభ పేరుతో ఇప్పటికే రెండు కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం నాడు మరో కార్యక్రమం కూడా ఇలాంటిదే జరిగింది. నిజానికి, ఈ కార్యక్రమం నిర్వహణ వెనక ఒక సామాజిక వర్గం నుంచి తెరాసపై వినబడ్డ విమర్శలే కారణమనే ప్రచారం ఉంది! మంత్రి కేటీఆర్ తమ సామాజిక వర్గం వారికి ప్రాధాన్యత కల్పించలేదంటూ గత సమావేశంలో కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేసిన అంశం కేటీఆర్ దృష్టికి వచ్చిందనీ, అందుకే భరత్ నగర్ లో ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చేలా ఒక సభను నిర్వహించారని తెలుస్తోంది. ఈ సభలో కేటీఆర్ ప్రసంగంలోగానీ, హాజరైనవారితో ఆయన వ్యవహరించిన తీరుగానీ గమనిస్తే అసలు విషయం స్పష్టంగా అర్థమౌతోంది.
‘పెద్దలు, జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్… స్వయంగా కేసీఆర్ దగ్గరకి వచ్చి, పాలన బాగుందని అభినందనలు తెలిపారు. రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తున్న విషయం బాగా నచ్చిందని వారు పత్రికగా ముఖంగా చెప్పిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నా’ అన్నారు కేటీఆర్. తాము ఏనాడూ కులం, మతం, ప్రాంతం చూడలేదనీ, కష్టంలో ఎవరున్నా ఆదుకునే ప్రయత్నం చేశామన్నారు. నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణిస్తే… ఆ కుటుంబానికి అండగా తెరాస ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగితే ఖండించి, సానుభూతి తెలియజేశామన్నారు. తాజా సమావేశంలో పవన్ కల్యాణ్ అభిమానులు కొంతమంది కేటీఆర్ కి జనసేన కండువాలు కప్పి, సెల్ఫీలు దిగడం విశేషం. తెలంగాణ ఎలాగూ పవన్ పోటీ చేయడం లేదు కాబట్టి, జనసేన మద్దతుదారులు… ఆ పార్టీని తమదిగా ఓన్ చేసుకుంటున్న ఒక సామాజిక వర్గానికి బాగా దగ్గరయ్యే ప్రయత్నం చేశారు.
స్థూలంగా చెప్పాలంటే… ఇక్కడి సీమాంధ్రులను మూడు ప్రముఖ సామాజిక వర్గాల కోణం నుంచి విడివిడిగా చూస్తూ, వారి ఓట్లను వేయించుకునే దిశగా కేటీఆర్ వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తున్నారని చెప్పొచ్చు. సీమాంధ్ర సంఘీభావ సభల పేరుతో జరిగిన అన్ని సభల తీరుని ఒక్కసారి గమనిస్తే… మొదటి సభలో ఒక సామాజిక వర్గం, రెండోది ఇంకోటి, ఇప్పుడు మరొకటి… ఇలా ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. హరికృష్ణ మరణం, జగన్ పై కోడి కత్తి దాడి, పెద్దలు పవన్ కల్యాణ్ గారు అంటూ సంబోధిస్తూ తాము ఇస్తున్న ప్రాధాన్యతను చాటుకునే ప్రయత్నం చేయడం… ఈ మూడింటికీ తన ప్రసంగాల్లో కేటీఆర్ ప్రాధాన్యత ఇస్తూ ఉండటం వెనక ఆంతర్యం ఇదే.