రాజకీయంగా విమర్శిస్తే ఓకే కానీ ప్రతీ దానికి వ్యక్తిగత విమర్శలు చేస్తే ఎదుటి వాళ్లకూ నోరు ఉంటుందనే విషయాన్ని మర్చిపోతూంటారు చాలా మంది. కేటీఆర్ కూడా అదే తప్పు చేశారు. మామూలుగానే ఆయన వ్యక్తిగత విమర్శలు చేయడంలో హద్దులు దాటిపోతూంటారు. ఈ సారి బండి సంజయ్ ను అలాగే అసువుగా అనేశారు. కానీ బండి సంజయ్ అంతకు పదింతలు కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన మాటలు సోషల్ మీడియాలో మార్మోగిపోతున్నాయి. పరువు నష్టం జరిగిందని కోర్టుకు వెళ్లడానికి కూడా ఉండదు.
బండి సంజయ్ గ్రూప్ వన్ విద్యార్థుల కోసం రోడ్డెక్కారు. బీఆర్ఎస్ నేతలు ఆశోక్ నగర్ వెళ్లలేకపోయారు. కేటీఆర్ కూడా కొంత మందిని బీఆర్ఎస్ భవన్ కు పిలిపించుకుని మాట్లాడుకున్నారు. ఎందుకంటే నిరుద్యోగుల సెగ వారికే ఎక్కువ తగులుతుంది. కానీ బండి సంజయ్ అలా కాదు. మొత్తం నిరుద్యోగుల ఉద్యమాన్ని హైజాక్ చేసినట్లుగా ఆందోళన చేశారు. ఇది కేటీఆర్‌కు కోపం తెప్పించింది. అందుకే ఆయనపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. మాలాగా పార్టీ ఆఫీసుకు పిలిపించుకుని మాట్లాడాలి కానీ.. రాజకీయంగా బలపడేలా ఉద్యమం చేయడం ఏమిటని ఆయన భావన. అందుకే బండి సంజయ్‌కు చదువు లేదు..చదువుకోలేదు.. పరీక్ష పేపర్లు లీక్ చేశాడు అని మాట్లాడారు.
ఈ మాటలు చెవిన పడిన తర్వాత బండి సంజయ్ రక్తం సలసలా మరిగిపోయింది. ప్రెస్ మీట్ పెట్టారు. గతంలో టెన్త్ పేపర్ల మాల్ ప్రాక్టీస్ కేసులో తనపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేయించారన్న కోపం పీకలదాకా బండి సంజయ్ కు ఉంది. దాంతో ఆయన మెల్లగా ప్రారంభించి..ఐదు నిమిషాల పాటు కేటీఆర్ పై తిట్లందుకున్నారు. ఆ తిట్లు మామూలుగా లేవు. థూ..నీది ఓ బతుకేనా అని కూడా ప్రశ్నించారు. నీళ్లు లేని బావిలో దూకాలని సలహా ఇచ్చారు. కేంద్ర మంత్రి హోదాలో ఉండి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పవచ్చు కానీ ఇలా మాట్లాడాల్సిన పరిస్థితి కల్పించింది మాత్రం కేటీఆరే.
ముఖ్యమంత్రి రేవంత్ పైనా ఆయన మాటలు గీత దాటిపోతున్నాయి. రేవంత్ రెడ్డిని సీఎంగా సంబోధించవచ్చని పార్టీ నేతలకు ఆయన చెప్పారని అంటున్నారు. కాంగ్రెస్ నేతలపై ఆయన నేతృత్వంలోని సోషల్ మీడియా వాడుతున్న భాష కేసులకు కారణం అవుతోంది. ఇప్పుడు బండి సంజయ్ మాటల్ని సోషల్ మీడియా ట్రోలింగ్‌కు ఏళ్లకేళ్లు వాడుకుంటుంది.