బీజేపీ, టీఆర్ఎస్ నేతలు మళ్లీ పొలిటికల్ ఫీల్డులోకి వస్తున్నారు. సవాళ్లకు సవాళ్లు చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న నిధుల విషయంపై కేటీఆర్, బండి సంజయ్ రాజీనామాలకు సిద్ధమా అని సవాళ్లు చేసుకున్నారు. తెలంగాణకు కేంద్రమే అన్నీ నిధులు ఇస్తోందని బండి సంజయ్ చెబుతున్నారు. కాదు తెలంగాణనే కేంద్రానికి నిధులిస్తోందని కేటీఆర్ అంటున్ారు. ఆరున్నరేళ్లలో రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ.2.72 లక్షల కోట్లు వెళ్లాయి. రాష్ట్రానికి కేంద్రం రూ.1.42 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చిందని ఇది నిజం కాకపోతే తాను రాజీనామా చేస్తానని కేటీఆర్ ప్రకటించారు.
నిజం అయితే బండి సంజయ్ ఎంపీ పదవికి రాజీనామా చేయాలన్నారు. మెదక్ జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కేటీఆర్ సవాల్‌పై స్పందించారు. కేటీఆర్ తుపాకీ రాముడని మండిపడ్డారు. సవాల్ చేసే స్థాయి ఆయనకు లేదని దమ్ముంటే కేసీఆర్ రాజీనామాకు సిద్ధమని సవాల్ చేయాలని తాను సిద్ధమని ప్రకటించారు. ప్రజలు చెల్లించే పన్నుల్లో కొంత రాష్ట్రానికి, కొంత కేంద్రానికి వెళ్తాయి. కేంద్రానికి వెళ్లే పన్నులు మళ్లీ రాష్ట్రాలకే కేటాయిస్తారు.
కేంద్రం అలా ఇచ్చే నిధుల్నే బీజేపీ తమ ఘనతగా చెప్పుకుంటూండటంతో రాజకీయంగా దుమారం రేగుతోంది. తాజాగా ఇది సవాళ్లకు దారి తీసింది. సహజంగా ఇలాంటి సవాళ్లన్నీ రాజకీయంగానే ఉండిపోతాయి. లెక్కలు బయట పెట్టేందుకు రెండు వర్గాలూ సిద్దం కావు. కేటీఆర్, బండి సంజయ్ సవాళ్లు కూడా నిజాలు బయటకు రావడానికి కావు.. కేవలం రాజకీయం చేసుకోవడానికే అనుకోవచ్చు.