తెలంగాణలో తెరాస, భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమాలకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా రాష్ట్రానికి వచ్చి సభ్యత్వ నమోదు ప్రారంభించారు. తెరాస కూడా నియోజక వర్గాల వారీగా లక్ష్యాలు నిర్వహించుకుని సభ్యత్వాలను పెంచుకునే ప్రయత్నం చేసింది. అయితే, భాజపా లెక్కలపై ఇప్పుడు రెండు పార్టీల నేతలూ రెండు రకాలుగా విమర్శించుకుంటున్నారు. తెలంగాణలో భాజపా కేవలం 12 లక్షల సభ్యత్వాలు నమోదు చేసుకుని గొప్పలు చెప్పుకుంటోందని కార్యకర్తల సమావేశంలో తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. తెరాస మెంబర్ షిప్ 60 లక్షలు దాటేసిందనీ, దాన్లో సగంలో సగం కూడా భాజపాకి లేవనీ, రాష్ట్రంలో ఆ పార్టీకి ఉన్న ఆదరణ ఏపాటిదో ఇక్కడే అర్థమౌతోందని కామెంట్ చేశారు. సభ్యత్వ నమోదు పుస్తకాలు కావాలంటూ జిల్లాల నుంచి ఇంకా డిమాండ్ ఉందన్నారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ స్పందిస్తూ… బీజేపీ సభ్యత్వాలు 12 లక్షలు నమోదైన సంగతి వాస్తవమేననీ, అయితే అంతకుముందే మరో 18 లక్షల సభ్యత్వాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. మొత్తం 30 లక్షల మార్కును ఎప్పుడో దాటేశామనీ, మరో ఆరు లక్షల సభ్యత్వాలను ఇంకా నమోదు చేయాల్సి ఉందన్నారు. సంఖ్య పెద్దగా చూపించడం కోసం చిన్న పిల్లలకు కూడా తెరాస సభ్యత్వాలు ఇచ్చేసిందనీ, సూర్యాపేట నియోజక వర్గంలో ఓటర్ల కన్నా సభ్యత్వాల సంఖ్య ఎక్కువ నమోదైందన్నారు. ఓటరు జాబితా దగ్గరపెట్టుకుని మెంబర్ షిప్ స్లిప్పులు రాసేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తాము ప్రతీ ఇంటికీ వెళ్లి, ఓటర్ ఐడీ చూసి, ఫోన్ నంబర్ తీసుకుని సభ్యుల్ని చేర్పించుకుంటున్నామన్నారు. తెరాసకి వందమంది ఎమ్మెల్యేలు, తొమ్మిదిమంది ఎంపీలున్నా… పన్నెండేళ్లుగా రాష్ట్రంలో తెరాస పార్టీ ఉన్నా ఇంకా 50 లక్షల సభ్యత్వాలే అనీ, ఒక్క ఎమ్మెల్యే ఉన్న భాజపా ఇప్పుడు 36 లక్షలకు చేరుకుందన్నారు. తెరాసది కుటుంబ రాజకీయమే తప్ప, సంస్థాగత నిర్మాణం లేదని విమర్శించారు.
తెరాసకి 60 లక్షల సభ్యత్వాలని కేటీఆర్ అంటారు, కాదు వారికి 50 దాటేలదని లక్ష్మణ్ అంటారు. భాజపాకి 12 లక్షలే సభ్యత్వ సంఖ్య అంటారు కేటీఆర్, కాదు కాదు 30 దాటేశామని లక్ష్మణ్ అంటారు. తెరాసలో సగం సభ్యత్వాలు భాజపా టార్గెట్ గా పెట్టుకుంది. అందుకే, దానికి అనుగుణంగా సగానికి మించిన లెక్కలు చెబుతోంది. తమకు భాజపా ప్రత్యామ్నాయం కాదని తెరాస చెప్పాలి కాబట్టి… వారి లెక్కల్లో భాజపాని తక్కువగా చూపిస్తోంది. ఈ లెక్కలో పైచేయి ప్రదర్శించాలనే ఆత్రం రెండు పార్టీలకీ ఉంది. మున్సిపల్ ఎన్నికలు ముందున్నాయి కాబట్టి, ఇదో రకమైన ప్రచారాస్త్రంగా వాడుకునే ప్రయత్నం… అంతే!