కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే ప్రజలు హర్షిస్తారట..! ఈ విషయాన్ని ఎవరో చెబితే పెద్దగా ప్రాధాన్యం ఉండేదేమో కాదు కానీ.. చెప్పింది మాత్రం.. నిన్నటిదాకా కేంద్రం తెలంగాణను నిర్లక్ష్యం చేస్తోందని.. యుద్ధమే చేయబోతున్నామని చెప్పిన కేటీఆర్ కాబట్టే విశేషం. హైదరాబాద్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్న కేటీఆర్…ఏకు మేకైన బీజేపీని ఒక్క మాట కూడా అనడం లేదు. పైగా కలిసి పని చేద్దామన్నట్లుగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. శనివారం.. పలు చోట్ల అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడ బీజేపీతో ఎలాంటి గొడవలు లేవని చెప్పేందుకు ప్రాధాన్యం ఇచ్చారు.
ఎన్నికలప్పుడే పంచాయతీ అని.. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి కాబట్టి.. కలిసి సమిష్టిగా పని చేసుకుందాం అంటూ స్నేహహస్తాన్ని చాచారు. ఇలా ఆయన అంటున్న సమయంలో… కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా కార్యక్రమంలో ఉన్నారు. అనవసర పంచాయతీలు మన మధ్య వద్దని ప్రజలు కూడా హర్షించరని ఆయన చెప్పుకొచ్చారు. ఓ వైపు బీజేపీ నేతలు.. టీఆర్ఎస్ సంగతి తేలుస్తామంటూ హెచ్చరికలు చేస్తున్నంత పని చేస్తున్నారు.
మరో వైపు.. టీఆర్ఎస్ నేతలు మాత్రం శాంతి మంత్రం పాటిస్తున్నారు. ఇప్పటి వరకూ కేటీఆర్ బీజేపీతో స్నేహం గురించి ఎక్కడా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు.. మాత్రం ఆయన స్నేహం చేసుకుందామని పిలుపిస్తున్నట్లుగా మాట్లాడుతున్నారు. మొత్తానికి కారణం ఏమిటో కానీ… బీజేపీ విషయంలో టీఆర్ఎస్ పూర్తిగా మారిపోయింది. ఎగిరి ఎగిరి దుమికిన దూకుళ్లు అన్నీ.. కట్టి పెట్టేసి.. సైలెంటవుతున్నారు. దీన్నే అలుసుగా తీసుకుని బీజేపీ నేతలు మరింత రెచ్చిపోతున్నారు.