అధికారంలోకి వస్తే బట్టలిప్పదీస్తామని పోలీసుల్ని జగన్ హెచ్చరించారు. కేటీఆర్ ఆ భాష వరకూ పోలేదు కానీ అంతే కఠినంగా హెచ్చరికలు జారీ చేశారు. మూడు ఏళ్లలో వస్తున్నాం.. కొడుతున్నామన్నట్లుగా పోలీసులకు వార్నింగులు పంపించారు. ప్రతిపక్షంలో ఉన్న అందరూ ఇలా పోలీసుల్ని బెదిరించడం కామన్ అయిపోయింది. తమ పార్టీ నేతలు ఏం చేసినా .. తప్పులు చేసినా పట్టించుకోకూడదని.. పట్టించుకుంటే తాము అధికారంలోకి వచ్చినప్పుడు గుర్తు పెట్టుకుని తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు. పోలీసులు వారి డ్యూటీ వారు చేస్తారు.
పొలిటికల్ మోటివేషన్ కేసులు అయితే వారి చేతుల్లో ఉండదు. వారి ఉద్యోగం కోసం వారు చేయాల్సిందే. ఇలా బెదిరించే వారు అధికారంలో ఉన్నప్పుడు ఆ పోలీసులతో అంత కంటే ఘోరాలు చేయించారు. వారిలో చాలా మందిని జైలుకు పంపించారు కూడా. ఏపీలో అయినా.. తెలంగాణలో అయినా.. అధికారంలో ఉన్న వారు చెప్పినట్లుగా చేసి చాలా మంది జైళ్లకెళ్లారు. అది కూడా తమ విధులు నిర్వహించినందుకు కాదు అధికారాన్ని దుర్వినియోగం చేసి ట్యాపింగులు, తప్పుడు కేసులు, తప్పుడు అరెస్టులు చేసి జైలుకెళ్లారు.
ఏ ప్రభుత్వంలో అయినా పరిధి దాటి ఇలాంటి పనులు చేసిన వారు చట్టం చేతుల నుంచి తప్పించుకోలేరు. సోషల్ మీడియా కేసుల్లో అరెస్టులు ఎవరూ కిందిస్థాయి పోలీసులు చేయరు. పై నుంచి ఆదేశాలు వస్తేనే చేస్తారు. కింది స్థాయి పోలీసుల్ని బెదిరించడం వల్ల ఏ ప్రయోజనమూ ఉండదు. పోలీసు వ్యవస్థను పదేళ్ల పాటు గుప్పిట్లో పెట్టుకుని కావాల్సినంత రాజకీయం చేసిన కేటీఆర్కు ఇది తెలియనిదేం కాదు. కానీ.. ఇలాంటి బెదిరింపుల వల్ల కొంత మంది అయినా వెనక్కి తగ్గుతారని ఆయన ఆశిస్తున్నారు.