దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల తర్వాత ఒత్తిడిలో ఉన్న టీఆర్ఎస్ పూర్తిగా దూకుడు తగ్గించింది. అయితే.. ఈ దూకుడు విపక్షాలకు పెద్ద చాన్స్లాగా అయిపోయింది. దాంతో వారు గతం కన్నా ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. వీటికి చెక్ పెట్టకపోతే.. తాము మరీ పలుచన అయిపోతామని టీఆర్ఎస్ నేతలు ఓ నిర్ణయానికి వచ్చారు. ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న బండి సంజయ్‌పై టీఆర్ఎస్ నేతలు విరుచుకుపడటం ప్రారంభించారు. ఇప్పుడు నేరుగా కేటీఆర్ కూడా అదే పని ప్రారంభించారు.
ఒక్క బండి సంజయ్‌ను విమర్శిస్తే బాగుండదని అనుకున్నారేమో కానీ.. ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిపి విమర్శించడం ప్రారంభించారు. మా సహనానికి హద్దు ఉంటుందని …నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. కేసీఆర్ తెలంగాణ తేకపోతే టీపీసీసీ, టీబీజేపీ అధ్యక్ష పదవులు లేవని వారికి చురకలంటించారు. కేటీఆర్ శైలి చూస్తూంటే… తాము మౌనంగా ఉన్నామని చెలరేగిపోతున్న విపక్ష పార్టీలకు చెక్ పెట్టాలన్న వ్యూహంతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. అయితే.. బండి సంజయ్ లాంటి నేతలు.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా.. ప్రస్తుతం ఫామ్‌లో ఉన్న పార్టీగా ఎవర్నీ లెక్క చేయడం లేదు.
కేసీఆర్ లాంగ్వేజే తనకు ఆదర్శమని చెబుతూ ఆయన చెలరేగిపోతున్నారు. ఆయన వ్యాఖ్యలు మరీ హద్దులు దాటినట్లుగా ఉంటూండటంతో టీఆర్ఎస్ నేతలు ప్రతి వ్యూహం అమలు చేస్తున్నారు. దాని ప్రకారమే ఎదురుదాడికి దిగుతున్నట్లుగా తెలుస్తోంది. కేటీఆర్‌తో బీజేపీ నేతలు మాటల యుద్ధానికి దిగుతారో లేకపోతే.. రాజకీయ వ్యూహాలను అమలు చేస్తారో వేచి చూడాలి..!