తెలంగాణ ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి కేటీఆర్ గురువారం ఢిల్లీలో కీలక భేటీలు నిర్వహించారు. హఠాత్తుగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కేటీఆర్.. ముందస్తు ఎన్నికలపై కేంద్ర పెద్దలతో చర్చలకే వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. అక్టోబరు మొదటి వారంలో నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూలు విడుదల కానుంది. వాటితో పాటే తెలంగాణకు కూడా ఎన్నికల షెడ్యూలు వచ్చేలా ఇప్పటికే ఢిల్లీలో టీఆర్ఎస్ లాబీయింగ్ ప్రారంభించింది. అసెంబ్లీని ఇప్పుడు రద్దు చేసినా.. నాలుగు రాష్ట్రాలతో పాటు ఎన్నికలు నిర్వహించకపోతే.. మొదటికే మోసం వస్తుంది. అందుకే కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మను రంగంలోకి దింపారు. ఆయన నేరుగా కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లి అధికారులతో మంతనాలు జరిపారు.
రాజీవ్ శర్మతో పాటు డిల్లీ పర్యటనలో తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రజిత్ కుమార్ కూడా ఉన్నారు. అందుకే ముందుస్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని నమ్ముతున్నారు. రాజీవ్ శర్మ ఈసీ అధికారులతో చర్చలు జరుపుతూండగానే… కేటీఆర్ ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. నిన్న ఉదయమే ఢిల్లీకి చేరుకుని.. రహస్యంగా పలువురు కేంద్ర పెద్దలతో సమావేశమయ్యారు. కేటీఆర్ ఎవరెవర్ని కలిశారన్నది బయటకు తెలియనీయలేదు. సమావేశాలు పూర్తి చేసి..అంతే వేగంగా తిరిగి వచ్చేశారు. కేటీఆర్ హైదరాబాద్ చేరకున్న కొద్ది సేపటికే ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ నరసింహన్ తో గంటకు పైగా భేటీ అయ్యారు.
ఆ తర్వాత తానే స్వయంగా ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. నాలుగైదు రోజుల పాటు ఢిల్లీలో ఉండి అయినా సరే… పనులు చక్క బెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. ముందస్తుకు వెళ్లడానికి అన్ని విధాలుగా సిద్ధమైన కేసీఆర్.. దానిపై గందరగోళంలో ఉన్నట్లు కనిపించడానికి.. కారణం.. ఈసీ నుంచి సానుకూల నిర్ణయం వస్తుందో రాదోనన్న సందేహమేనని చెబుతున్నారు. అందుకే.. కేసీఆర్ రంగంలోకి దిగారని చెబుతున్నారు.