సీఎం అనే రెండక్షరాల కంటే కేసీఆర్ అనే మూడు అక్షరాలే పవర్ ఫుల్ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సినిమా స్టైల్లో డైలాగులు చెప్పారు. తుడిచి పెట్టుకుపోయిన ఖమ్మం పార్లమెంట్ స్థానంలో పోటీ చేసిన అభ్యర్థులకు ధైర్యం చెప్పేందుకు.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోరాడేందుకు ఆయన కేసీఆర్ పవర్ గురించి మాట్లాడారు. మనమంతా తెలంగాణ ఉద్యమం సమయంలో గట్టిగా పోరాడిన వాళ్లమేనని.. అసెంబ్లీ సమావేశాల్లోను మన పోరాట పటిమను చూపించామని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి అని చాయిస్ వాళ్లకే వదిలేశారు. నిజానికి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే ఉద్దేశంలో లేరని అందరూ చెప్పుకుంటున్నారు. కానీ కేటీఆర్ మాత్రం మళ్లీ కేసీఆరే చార్జ్ తీసుకుంటారని.. తెలంగాణ మొత్తం పర్యటిస్తారని అసెంబ్లీకి వస్తారని అంటున్నారు.
కేసీఆర్ ఫిబ్రవరిలో ప్రజల మధ్యకు వస్తున్నారన్నారు. త్వరలో రాష్ట్ర, జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇక ముందు ప్రతి మూడు నెలలకోసారి అన్ని కమిటీల సమావేశాలు ఉంటాయన్నారు. ఖమ్మంలో అందరం కలిసి ముందుకు సాగుదామని… లోక్ సభ సీటును తప్పనిసరిగా గెలుచుకోవాల్సిందే అన్నారు. తెలంగాణ గళం… బలం బీఆర్ఎస్ మాత్రమే అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మనం 39 సీట్లలో గెలిచామని 11 స్థానాల్లో అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయామన్నారు. మరికొన్ని స్థానాలలో ఓటమికి వివిధ కారణాలు ఉన్నాయని చెప్పారు. అన్నింటినీ సమీక్షించుకొని ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పై ప్రజల్లో అప్పుడే అసహనం పెరిగిపోయిందని కేటీఆర్ చెప్పుకుంటున్నారు. అధికారం లేకపోతే ఉండలేనట్లుగా.. రేపే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని అందుకోవాలన్నంత ఆతృతగా కేటీఆర్ ప్రకటనలు ఉండటం ప్రజల్ని సైతం ఆశ్చర్య పరుస్తోంది.