తెలంగాణలో కేసీఆర్ రాజకీయ వారసత్వం కేటీఆర్‌కే. అందులో డౌటే లేదు. మరి ఆ వారసత్వం అందుకుంటున్నకేటీఆర్ కూడా.. కేసీఆర్ స్టైల్‌ని చూపించాలిగా… ! మునుగోడు ఉపఎన్నికల్లోనే అది చూపిస్తున్నారు. మునుగోడులో టీఆర్ఎస్ను గెలిపిస్తే తానే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని సిరిసిల్లలాగా అభివృద్ధి చేస్తానని చెబుతున్నారు. అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరైన ఆయన ప్రచారసభల్లో మాట్లాడారు. ఈ సందర్భంగా దత్తత హామీ ఇచ్చారు.
కేసీఆర్ కు ఇలాంటి దత్తత హామీలు ఇవ్వడం హాబీలాంటిదని అనుకోవచ్చు. ఉపఎన్నికలు లేదా.. ప్రత్యేకమైన సందర్భాల్లో గ్రామాల్లోకి ఊళ్లకి వెళ్తే.. తాను ఆ ఊరిని దత్తత తీసుకుంటానని చెబుతూ ఉంటారు. ఇలాంటి ఊళ్లు చాలా ఉంటాయి. అందుకే రేవంత్ రెడ్డి తరచూ.. కేసీఆర్ దత్తత తీసుకున్న ఊళ్లో పరిస్థితి చూపిస్తానంటూ.. అక్కజే కార్యక్రమాలు పెడుతూ ఉంటారు. ఇప్పుడు కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్లారు. ఇప్పుడు ఊళ్లను.. నియోజకవర్గాలను దత్తత తీసుకునే బాధ్యత కేటీఆర్ తీసుకున్నారు.
అయితే కేటీఆర్ లేదా కేసీఆర్ నియోజకవర్గం .. లేకపోతే వారు దత్తత తీసుకునే నియోజకవర్గాలే బాగుపడతాయా.. మిగతా వాటికి నిధులు అందవా అనే సందేహం సహజంగా అందరికీ వస్తుంది. అయితే ఎన్నికల సమయంలో మిగతా చోట్ల ఏమనుకుంటారనేది రాజకీయ పార్టీలు పట్టించుకోవు. ఎన్నికలు జరిగిన తర్వాత ప్రజలు మర్చిపోతారు. ఓటర్లు కూడా మర్చిపోతారు. వారికే గుర్తుండనిది ఇక రాజకీయ నేతలకేం గుర్తుంటుంది. అయితే… ఎన్నికలు జరుగుతున్నప్పుడు అభ్యర్థి కాస్త బలహీనమనుకుంటే.. తానే స్వయంగా చూసుకుంటానని హమీ ఇవ్వడం ద్వారా ప్రజలకు నమ్మకం కలిగించడానికి మాత్రం ఈ హామీ పనికి వస్తుంది. మునుగోడులో కేటీఆర్ అదే చేశారని అనుకోవచ్చు.