కొత్త ఏడాదిలో అంటే 2020లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కమ్ మంత్రి కమ్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ముఖ్యమంత్రి అయ్యే యోగం ఉందని ఈమధ్యనే ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక రాసింది. ప్రధానంగా రెండు విషయాలు తెలంగాణలో అప్పుడప్పుడు ప్రచారంలోకి వస్తుంటాయి. కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని గత లోక్‌సభ ఎన్నికల ముందు తీవ్రంగా ప్రచారమైంది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిపోయి, అక్కడ తలమునకలైపోయి చక్రం తిప్పుతారని, రాష్ట్రంలో కుమారుడు కేటీఆర్ సీఎంగా చక్రం తిప్పుతాడని ప్రచారమైంది. సరే…తరువాత కేసీఆర్ అంచనాలు తప్పిపోయి ఆయన మళ్లీ సీఎంగానే ఉన్నారు. మరో ప్రచారం ఏమిటంటే…రాష్ట్ర మంత్రి కమ్ కేసీఆర్ మేనల్లుడు హరీష్‌రావు ఏనాటికైనా మామకు వెన్నుపోటు పొడిచి తానే అధికారంలోకి వస్తాడని.
ఉమ్మడి ఏపీలో చంద్రబాబు నాయుడు తన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారం హస్తగతం చేసుకున్నట్లే హరీష్‌రావు చేస్తాడని ప్రతిపక్ష నేతలు కొందరు అప్పుడప్పుడూ ప్రచారం చేస్తుంటారు. హరీష్ రావు ఏం చేస్తాడో ఇప్పుడు ఊహించడం అనవసరం. దానికి సరైన ఆధారాలు, సంకేతాలు లేవు. కాని కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని చెప్పడానికి సంకేతాలున్నాయి. మొదటిది ఆయన కేసీఆర్ కుమారుడు కావడం. వాస్తవానికి ఇంతకు మించిన అర్హత మరొకటి లేదు. ఇది కాకుండా మంత్రిగా, పార్టీ నాయకుడిగా, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. తండ్రి ఆయన ఇచ్చిన బాధ్యతలను పరిపాలనపరంగా, రాజకీయంగా విజయవంతంగా నిర్వర్తించాడు. ఇకముందూ చేస్తాడు.
సరే…ఇక అసలు విషయం ఏమిటంటే, మంత్రి శ్రీనివాసగౌడ్ ఉన్నట్లుండి ఏనాటికైనా కేటీఆరే ముఖ్యమంత్రి అని మీడియాకు చెప్పాడు. కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడనేది తన అభిప్రాయమని చెప్పకుండా ప్రజలు అనుకుంటున్నారని చెప్పాడు. ఇలా అనుకోవడం సహజమని కూడా అన్నాడు. ‘ఈరోజో, రేపో, ఇంకో ఐదేళ్ల తరువాతో, పదేళ్ల తరువాతో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారు’ అని చెప్పాడు. ఇది కొత్త విషయం కాదు. ఇదేమీ శ్రీనివాస్ గౌడ్ పరిశోధించి వెలికి తీసిన విషయం కాదు. కాని ఇప్పుడు ఎందుకు చెప్పాల్సివచ్చిందనేదే ప్రశ్న. శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు టీఆర్ఎస్లో కలకలం రేపుతున్నాయి. కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చాలాకాలంగా టీఆర్ఎస్లో, ఇతర పార్టీల్లో, జనాల్లో ఉన్న అభిప్రాయం, నమ్మకం, ఊహాగానం కూడా. కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ముందు విపరీతమైన ప్రచారం జరిగింది.
టీఆర్ఎస్లో దీనిపై చర్చ జరిగింది. కేసీఆర్ ప్రధాని అవుతారని, కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని గులాబీ పార్టీ నాయకులు చాలామంది బహిరంగంగానే చెప్పారు. ‘దేశ్‌కీ నేత కేసీఆర్’ అని కూడా అన్నారు. అప్పట్లో ఇంత ఊపు రావడానికి కారణం తాను ఫెడరల్ ఫ్రంట్ పెట్టి దేశ రాజకీయాల్లో దుమ్ముదుమారం లేపుతానని, గుణాత్మక మార్పు తీసుకువస్తానని, దేశ ఆర్ధిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కిస్తానని అంటూ కేసీఆర్ ఉరుకులు పరుగులు పెట్టడమే. ఇక టీఆర్ఎస్ నాయకులు రాష్ట్రానికి కేసీఆరే ముప్పయ్ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారని, ప్రత్యామ్నాయం లేదని అన్నారు. కొంతకాలం క్రితం కేసీఆర్ ఓ సందర్భంలో మాట్లాడుతూ మరో రెండు టర్మ్‌లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని అన్నారు. తన ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా ఉందన్నారు.
మరి ఇప్పుడు కొత్త ఏడాదిలోనే కేటీఆర్‌కు పీఠం అప్పగిస్తారనే ఊహాగానాలు బయలుదేరాయి. కుమారుడిని ముఖ్యమంత్రిని చేయాలని కేసీఆర్‌పై ఒత్తిడి వస్తోందట…! ఇప్పుడు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాటలు ఆంగ్ల పత్రిక కథనానికి అనుగుణంగానే ఉన్నాయి. కేటీఆర్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటుగా నియమించినప్పుడు మీడియావాళ్లు ముఖ్యమంత్రి ప్రస్తావన తెచ్చారు. దానికి కేటీఆర్ సమాధానమిస్తూ తనను తాను నిరూపించుకున్నానని, సవాళ్లను స్వీకరించి వాటిని పూర్తి చేశానని చెప్పాడు. పార్టీలో చాలామంది సీనియర్లు, అనుభవజ్ఞులు ఉన్నారని అంటూ సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటే రాహుల్ గాంధీ కాంగ్రెసు అధ్యక్షుడయ్యేవాడు కాదన్నారు. అంటే తనకు సీఎం అయ్యే అర్హత ఉందని పరోక్షంగా చెప్పాడన్నమాట. టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ. మరి ఇందులో వారసుడు ముఖ్యమంత్రి కాకుండా ఇంకెవరు అవుతారు?