తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడటం కన్నా రేవంత్ రెడ్డిపై వ్యక్తిగతంగా పోరాడటమే తమ టార్గెట్ అన్నట్లుగా బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా ఉన్నారు. నేరుగా రేవంత్ రెడ్డిని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. ఆయనే కాంగ్రెస్ పార్టీకి బలం కాబట్టి అలా చేస్తున్నారని అనుకుందాం. అయితే రేవంత్ పై చేస్తున్న ఆరోపణలు మాత్రం రొటీన్ గా ఉంటున్నాయి. ఆయనను ప్రజలంతా తిడుతున్నారు.. మరొకరు అయితే ఆత్మహత్య చేసుకునేవారు.. వ్యతిరేకత విపరీతంగా పెరిగింది..త మళ్లీ వచ్చేది మేమే..ప్రజలు కేసీఆర్ ను కోరుకుంటున్నారని చెప్పడమే పోరాటం అయిపోయింది.
రోజూ చెప్పిందే చెబుతున్న కేటీఆర్
కేటీఆర్ ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ఏదో ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతున్నారు. ఆ ప్రసంగాల్లో మార్పేమీ ఉండదు. రేవంత్ రెడ్డి పై తనకు ఉన్న కోపం మొత్తం చూపిస్తూ ఉంటారు. మాట్లాడితే రాష్ట్రంలోని ప్రజలు రేవంత్ రెడ్డిని తెలుగు భాషలో ఉన్న తిట్లన్ని తిడుతున్నారని చెబుతూ ఉంటారు. మరొకరు అయితే ఆత్మహత్య చేసుకునేవారని చెబుతూంటారు. ఈ మాటలు ఎదుట వినేవారికి కూడా ఆశ్చర్యకరంగా ఉంటాయి. అంతే కాదు తెలంగాణ ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత పెరిగిపోయిందని చెబుతుంటారు. ఇక కేసీఆర్ వచ్చేయాలని ప్రజలు తీర్మానించుకున్నారని చెప్పి ప్రసంగాన్ని ముగిస్తారు. మధ్యలో పథకాలు ఏమీ అమలు చేయలేదని.. కేసీఆర్ అన్నీ చేశారని అంటారు.
వ్యతిరేకత బాగా పెరిగితే ఇలాగేనా రాజకీయం చేసేది ?
ఇవే మాటలు అదే పనిగా చెప్పడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుందో కానీ.. ప్రతీ రోజూ అవే మాటలు రోజుకు మూడు, నాలుగు సార్లు మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం వల్ల ఇంత కంటే మ్యాటర్ లేదా అన్న అభిప్రాయం మాత్రం ఏర్పడుతోంది. రేవంత్ రెడ్డిపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉంటే.. ప్రజా ఉద్యమాలు ఎందుకు చేపట్టడం లేదన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. ఫలానా అంశంలో ప్రభుత్వం విఫలమయిందని .. ఆ విషయాన్ని నేరవేర్చి తీరాలని ప్రజల్ని తీసుకుని రోడ్డెక్కి ప్రజల కోసం పోరాడాలి కదా అన్న ప్రశ్న వస్తుంది. అంత వ్యతిరేకత ఉన్నప్పుడు ఎందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదన్న ప్రశ్నకు సమాధానం లేదు.
వ్యూహాత్మక లోపం కనిపించడం లేదా ?
ఓ వైపు కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి బయటకు రాకపోవడాన్ని సమర్థించుకోలేకపోతున్నారు. ఇదిగో అదిగో అంటున్నారు కానీ ఆయన మాత్రం బయటకు రావడంలేదు. కేటీఆర్ చేస్తున్న పోరాటానికి.. ప్రచారాలకు.. డైలాగులకు ఎంత మైలేజీ వస్తుందో ఆ పార్టీ నేతలకు కూడా అర్థం కావడం లేదు. హరీష్ రావుకు ఫోకస్ రావడం లేదు. కవిత జాగృతి కోసం పని చేస్తున్నట్లుగా రాజకీయం చేస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ ను తిట్టడం.. తమను పొగుడుకోవడం తప్ప బీఆర్ఎస్ ఏమీ చేయలేకపోవడం మాత్రం బీఆర్ఎస్ క్యాడర్ నూ ఆశ్చర్యపరుస్తోంది.