కేటీఆర్ అన్యాపదేశంగా చేస్తారో లేకపోతే ఉద్దేశపూర్వకంగా చేస్తారో కానీ ఆయన మాటల్లో అహంకారం టన్నుల కొద్దీ బయటపడుతుందని రాజకీయవర్గాలు విశ్లేషిస్తూ ఉంటాయి. ఆయన మాట తీరు కూడా అలాగే ఉంటుంది. అది ఆత్మవిశ్వాసం అని ఆయన అనుకుంటారో.. తమ మీద నమ్మకాన్ని తాము వ్యక్తం చేసుకుంటున్నామని అనుకుంటారో కానీ..ఆయన మాటలన్నీ ఎదుటి వారు ..తమతో పోలిస్తే చాలా చిన్న వాళ్లని చెబుతూ ఉంటారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. తాడి తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడొకడుంటాడని కేటీఆర్ ఇంకా అర్థం చేసుకోలేపోతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
సీఎం కన్నా కేసీఆర్ రేంజ్ ఎక్కువా ?
కేసీఆర్ అసెంబ్లీకి రావడంలేదు. ఎందుకు రావడం లేదు అంటే.. కేసీఆర్ స్థాయికి ఎవరూ లేరని కేటీఆర్ అంటున్నారు. ప్రజాస్వామ్యంలో స్థాయిలు నిర్ణయించేది ప్రజలే. సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఉన్నారు. ఇవి అసలైన స్థాయిలు. ప్రజలు నిర్ణయించిన రేంజ్‌లు. ఈ పరిధే అధికారికం. తాము ఊహించుకున్నది కాదు. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇచ్చినప్పుడు .. తీసుకున్నప్పుడు వారి కోసం పని చేయాలి. అంతే కానీ.. ముఖ్యమంత్రిది నా రేంజ్ కాదు..నేను సభకు హాజరు కాను అంటే ఎలా ?. కేటీఆర్ ఎందుకు దీన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు.
ఇతరులంటే ఎందుకంత చులకన ?
కేటీఆర్ మాటల్లో కానీ.. చేతల్లో కానీ ఇతరులంటే చాలా చాలా చులకన కనిపిస్తూ ఉంటుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు వెళ్తున్నాయని..ఈవెన్ ఆంధ్రప్రదేశ్ అేనే మాట వాడారు. పొరుగు రాష్ట్రాన్ని అంతగా కించపర్చాల్సిన అవసరం ఏమిటో కేటీఆర్ కే తెలియాలి. సొంత పార్టీ నేతలతోనూ ఆయన వ్యవహరించే విధానం తేడాగా ఉంటుంది. ఎమ్మెల్సీగా నామినేషన్ వేయడానికి వెళ్లిన సమయంలో దాసోజు శ్రవణ్ పిలిస్తే పలకలేదని..ఇతరులతో మాట్లాడుతున్నాడని చెప్పి అదో రకమైన ఫేస్ ఫీలింగ్ పెట్టి.. గట్టిగా కొట్టి పిలవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదంతా యాటిట్యూఀడ్ మ్యాటర్స్ గా మిగిలిపోతాయి.
రాజకీయాల్లో అహంకారం పతనానికి మొదటి మెట్టు !
బయట ఎక్కడైనా ఎవడైతే నాకేంటి..నేను ఎవరెస్టును అని ఊహించుకుని దానికి తగ్గట్లుగా ఉండవచ్చేమో కానీ.. రాజకీయాల్లో మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరైనా ఏదైనా సాధించినా అది వారి సొంతం కాదు. ప్రజలు ఇచ్చేదే. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని తమ సొంతంగా భావించి.. వారిచ్చిన హోదాను తమ కష్ట ఫలితం అనుకుని ఇతరుల్ని ..ఇతర ప్రాంతాల్ని కించ పరిస్తే.. ఆ ప్రజలు కూడా సహించరు. ఎందుకంటే ఆ అహంకారానికి తామే బాధ్యులం అనుకుంటారు. కేటీఆర్ లాంటి ఎంతో భవిష్యత్ ఉన్న నేతలు దీన్ని గుర్తించాల్సి ఉందేమో !