తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడు అసలైన పరీక్షను ఎదుర్కొంటున్నారు. అందుకే ఆయన పండుగ మూడ్లో లేరు. అసలు సంక్రాంతిని పట్టించుకోకుండా… పూర్తిగా పార్టీ పనిపైనే దృష్టి పెట్టారు. మూడు రోజులుగా ఆయన సిరిసిల్ల దగ్గర్నుంచి సాగర్ వరకూ కీలకమైన.. అత్యవసరమైన నియోజకవర్గాల నేతల్ని పిలిపించుకుని మాట్లాడుతున్నారు. సొంత నియోజకవర్గం సిరిసిల్లలో కొన్నాళ్లుగా గ్రూపు తగాదాలు పెరిగిపోతున్నాయి. అధికార పార్టీలో ఉండాలనే తపనతో ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున నేతలు వచ్చి చేరారు. ఇప్పుడు సిరిసిల్ల నియోజకవర్గంలో వారిదే హవా. దీంతో ఎప్పటి నుండో కేటీఆర్ వెంట ఉన్న వాళ్లకు ఆదరణ లేకుండా పోయింది. ఈ విబేధాలు ముదిరిపోతూండటంతో కేటీఆర్ అందర్నీ హైదరాబాద్కు పిలిపించి మాట్లాడి సర్ది చెప్పారు.
ఆ తర్వాత శాసనమండలికి జరగనున్న ఎన్నికలు, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇప్పటికే టీఆర్ఎస్ ఆత్మరక్షణ ధోరణిలో ఉంది. అటు దుబ్బాక ఉపఎన్నిక ఇటు.. గ్రేటర్ ఎన్నికల్లో పడిన దెబ్బతో… మరో ఓటమి ఎదురైతే.. ఇమేజ్ మరింతగా దిగజారుతుందని ఆందోళన చెందుతున్నారు. అందుకే మండలి ఎన్నికలపై ప్రత్యేకగా దృష్టి పెట్టారు. పట్టభద్రులంతా ఓటు హక్కు వినియోగించుకుంటారు కాబట్టి వారి మెప్పును పొందేందుకు ఉద్యోగాలభర్తీ సహా అనేక కార్యక్రమాలు ప్రకటించారు. ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల విషయంలోనూ నేతలకు ప్రత్యేకంగా దిశానిర్దేశం చేస్తున్నారు. మూడు రోజులుగా సమావేశాలతో అందర్నీ పిలిపించి… దిశానిర్దేశం చేసి పంపించారు.
వీటన్నింటితో పాటు టీఆర్ఎస్ను వెంటాడుతున్న మరో గండం నాగార్జున సాగర్ ఉపఎన్నిక. ఈ విషయంలోనూ.. కేటీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే… ఈ ఉపఎన్నికపై రకరకాల ప్రచారాలుసాగుతున్నాయి. కాంగ్రెస్ ను గెలిపించేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని.. జానారెడ్డి మళ్లీ పోటీకి సిద్ధమవడం వెనుక.. కేసీఆర్ అభయం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇదంతా రాజకీయ కుట్రేనని… టీఆర్ఎస్ అభ్యర్థే అక్కడ విజయం సాధిస్తారన్న నమ్మకంతో కేటీఆర్ ఉన్నారు. అందుకే… ఇప్పటికే ప్రభుత్వం తరపున పలు పథకాలు ప్రకటించారు. ఇప్పుడు కేటీఆర్… ప్రత్యేకంగా దృష్టి సారించి.. గ్రామాల వారీగా వ్యూహరచన చేస్తున్నారు. మొత్తానికి కేటీఆర్… ఈ సంక్రాంతిని సంతోషంగా జరుపుకోలేకపోయారు. ఈ ఎన్నికలన్నింటిలో గెలిచి.. వచ్చే సంక్రాంతిని ఫుల్ జోష్లో జరుపుకోవాలన్న లక్ష్యంతో ఆయన ఉన్నారు.