కొత్త మున్సిపల్, పంచాయతీరాజ్ చట్టం… ఇది అత్యంత కఠినంగా ఉండబోతోందంటూ ఈ మధ్య ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు మంత్రి కేటీఆర్. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కూడా సొంత పార్టీ అభ్యర్థులను ఉద్దేశించి ఇదే చెప్పారు. కొత్త చట్టం ప్రకారం ఎవరైనా తప్పులు చేసే క్షమించేది ఉండదన్నారు. ఓ నాలుగు రోజుల కిందట ప్రగతి భవన్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇదే మాట చెప్పారు. ఫొటోలకు ఫోజులు ఇవ్వడాలు తగ్గించుకుని సరిగా పనిచెయ్యకపోతే కఠినంగా చర్యలు ఉంటాయంటూ హెచ్చరించారు. మంత్రి కేటీఆర్ మరోసారి ఇదే తరహాలో నాయకులను ఉద్దేశించి సిరిసిల్లలో వ్యాఖ్యానించారు.
కొత్తగా వచ్చే మున్సిపల్, పంచాయతీరాజ్ చట్టం చాలా శక్తివంతంగా ఉంటుందన్నారు కేటీఆర్. ఏ చిన్న తప్పు చేసినా సర్పంచులు, ఎంపీటీల పదవులు ఊడిపోవడం ఖాయమన్నారు. క్షేత్రస్థాయిలో మున్సిపల్ కౌన్సిలర్లంటే చాలా చెడ్డపేరుందన్నారు. ఇది పూర్తిగా మారిపోవాలనీ, లంచం అనే మాట ఎక్కడా వినిపించకూడదన్నారు. కొత్త చట్టం అమలు ద్వారా నాయకుల జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల బాగోగులు కోరుకునే వ్యక్తి అనీ, అందుకే స్థానిక సంస్థలపై ఇంత శ్రద్ధ పెడుతున్నారని కేటీఆర్ మెచ్చుకున్నారు. క్షేత్రస్థాయిలో అవినీతిని సహించే పరిస్థితి ఉండదన్నారు.
పదేపదే పదవులు ఊడగొడతాం, చర్యలు తీవ్రంగా ఉంటాయంటూ నాయకులకు సొంత పార్టీ అధినాయకత్వమే హెచ్చరించడం విడ్డూరంగా ఉంటోంది! ఓరకంగా, చట్టాల పేరుతో నాయకుల్ని ముందు నుంచీ బెదరగొట్టేస్తున్నారని అనొచ్చు. కిందిస్థాయి నాయకులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పట్నుంచీ ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారేమోగానీ… ఈ క్రమంలో మరో సందేశం కూడా వెళ్తోంది. క్షేత్రస్థాయిలో నాయకులు అవినీతిపరులు అని పరోక్షంగా చెబుతున్నట్టుగా, అందుకే ఈ స్థాయిలో ఇప్పట్నుంచీ కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారా అనే అభిప్రాయమూ కలుగుతోంది. ఆ చట్టం ఎప్పుట్నుంచీ వస్తుందో తెలీదుగానీ, వస్తే ఏం చేస్తారో అనే బెంగ నాయకుల్లో కావాల్సినంత సృష్టిస్తున్నారు. నాయకులకు బాధ్యత గుర్తుచేయడానికి ఈ స్థాయిలో భయపెట్టాల్సిన అవసరం ఏముంది..?