బుధవారం ఢిల్లీ, కొలకొత్తా జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కొలకొత్తా విజయాన్ని అందుకొంది. అయితే.. మ్యాచ్ అనంతరం అనూహ్యమైన పరిణామం జరిగింది. సీనియర్ ఆటగాడు కులదీప్ (ఢిల్లీ), కొలకొత్తా బ్యాటర్ రింకూ సింగ్ పై చేయి చేసుకొన్నాడు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మ్యాచ్ ముగిశాక ఆటగాళ్లు గుమిగూడి సరదాగా కబుర్లు చెప్పుకోవడం కామన్. బుధవారం మ్యాచ్ అనంతరం కూడా ఇదే జరిగింది. కులదీప్, రింకూ సింగ్ తదితర ఆటగాళ్లు ఓచోట చేరి కబుర్లలో పడిపోయారు. రింకూ, కులదీప్ జోకులు వేసుకొన్నారు. అయితే సడన్ గా ఏమైందో… కులదీప్ రింకూ చెంప ఛెళ్లుమనిపించాడు. దాన్ని కూడా రింకూ సరదాగానే తీసుకొన్నాడు. అయితే మరోసారి కూడా కుదీదీప్ చేయి చేసుకోవడంతో రింకూతో పాటు అక్కడున్నవాళ్లు కూడా షాక్ కి గురయ్యారు. ఇదేదో సరదాగా కొట్టిన దెబ్బ కాదన్నది కులదీప్ ఎక్స్ప్రెషన్ చూస్తే అర్థమైపోతుంది. అసలు వారిద్దరి మధ్య ఎలాంటి సంభాషణ జరిగింది? తోటి ఆటగాడిపై చేయి చేసుకొనే స్థాయిలో ఏం జరిగింది? అనేది రింకూ, కులదీప్లకే తెలియాలి. కాకపోతే.. తోటి ఆటగాడిపై ఇలా చేయి చేసుకోవడం ఏమాత్రం భావ్యం కాదు. ఇది వరకు కూడా ఐపీఎల్ లో ఇలాంటి ఘటనలు జరిగాయి. సదరు ఆటగాళ్లపై క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకొన్నారు. ఇప్పుడు కులదీప్ పై కూడా అలాంటి చర్యలేమైనా తీసుకొంటారేమో చూడాలి. అభిమానులు కూడా కులదీప్ ఇలా దూకుడుగా వ్యవహరించడం ఇది వరకెప్పుడూ చూడలేదని, సాటి ఆటగాడ్ని గౌరవించకపోయినా ఫర్వాలేదు కానీ, ఇలా చేయి చేసుకోవడం అనాగరికమని, స్పోర్ట్స్‌మెన్ షిప్‌కు ఇది వరుద్ధమని, కులదీప్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిందే అని అభిప్రాయపడుతున్నారు.