కర్ణాటకలో కాంగ్రెస్ – జేడీఎస్ మధ్య సయోధ్య ప్రతీ రోజూ ఓ యుద్ధంలా సాగుతోంది. ఇద్దరూ గెలవాల్సిందే. ఏ ఒక్కరైనా ఓడిపోయినట్లు అనిపించినా.. అది అంతిమంగా ఇద్దరి ఓటమికి కారణం అవుతుంది. దీనికి తోడు.. పార్టీల్లో అంతర్గతంగా మరో యుద్ధం జరుగుతోంది. పదవులు రాని వారు… వచ్చిన పదవులతో సంతృప్తి పొందని వారు.. కూటములుగా మారిపోతున్నారు. ఫలితంగా కుమారస్వామి పరిస్థితి దినదినగండం …నూరేళ్లాయుష్షు అన్నట్లుగా మారిపోయింది.
మంత్రి పదవులు దక్కని పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓ కూటమిగా మారి… కుమారస్వామిని టెన్షన్ పెట్టారన్న ప్రచారం ఉద్ధృతంగా సాగింది. ఈ ఎమ్మెల్యేలను డిప్యూటీ సీఎం పరమేశ్వర, మంత్రి డీకే శివకుమార్‌లు బుజ్జగించేందుకు విశ్వస ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవుల ప్రస్తావన వస్తే ముందుగా వినిపించాల్సిన పేర్లు ఎంబీ పాటిల్, రోషన్ బేగ్, రామలింగా రెడ్డి, కృష్ణప్ప, దినేశ్ గుండురావు. కానీ వీరెవరరికి మంత్రి పదవులు దక్కలేదు. దీంతో వీరు అవమానభారంతో రగిలిపోతున్నారు. లింగాయత్‌లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంబీ పాటిల్, ఈశ్వర్ ఖండ్రేలను సైతం కేబినేట్లోకి తీసుకోకపోవడం కాంగ్రెస్‌లోని ఇత వర్గాలను కూడా ఆశ్చర్య పరిచింది.
ఎమ్మెల్యేలతో చర్చలకు వచ్చిన డిప్యూటీ సీఎం పరమేశ్వర, డికే శివకుమార్లపై ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కన్నడ మీడియా చెబుతోంది. కేబినెట్లో ఇంకా ఆరు ఖాళీలు ఉన్నాయని త్వరలోనే విస్తరణ ఉంటుందని అసంతృప్తులందరికీ.. కాంగ్రెస్ నేతలు సర్ది చెబుతున్నారు. శాఖల పంపిణీ విషయంలో జేడీఎస్ – కాంగ్రెస్ ఇప్పటికైతే లెక్క తేల్చుకున్నాయి. కుమారస్వామి ఆర్థిక, ఎక్సైజ్ శాఖలతో సహా మొత్తం 11 కీలక శాఖలను తన వద్దే ఉంచుకున్నారు. డిప్యూటీ సీఎం పరమేశ్వర్‌కు హోం మంత్రిత్వశాఖతో పాటు ఇంటెలిజెన్స్ విభాగం, యువజన, క్రీడల శాఖలను కేటాయించారు. డీకే శివకుమార్ భారీ, మధ్య తరహా నీటిపారులశాఖతో పాటు వైద్య విద్య, కుటుంబ సంక్షేమ శాఖలను కేటాయించారు. రెండు పార్టీల మధ్య వివాదానికి కారణమైన విద్యుత్ శాఖను కుమారస్వామి తన దగ్గరే ఉంచుకున్నారు.
మొత్తానికి … దేశం మొత్తం దృష్టిని ఆకర్షించిన కర్ణాటక రాజకీయం రోజు రోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి వచ్చే ఢోకా లేకపోయినా… ఎమ్మెల్యేల్లో పెరిగిపోయే అసంతృప్తి… ఎప్పటికైనా బ్లాస్ట్ అయితే ప్రమాదకరమే.