ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు… కేంద్ర దర్యాప్తు సంస్థకు ఏపీలో ప్రవేశం లేకుండా తీసుకున్న నిర్ణయం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయింది. ఇప్పటికే టీడీపీ నేతలపై ఐటీ, ఈడీ దాడులు చేయించిన కేంద్ర ప్రభుత్వం… సీబీఐ దాడులు చేసేందుకు రంగం సిద్ధం చేసిందని.. కొంత మందితో హిట్ లిస్ట్ రెడీ అయిందని ప్రభుత్వ పెద్దలకు సమాచారం అందింది. వెంటనే విరుగుడుగా 1946 ఢిల్లీ పోలీస్ స్పెషల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ లోని సెక్షన్ 6ను ఉపయోగించుకున్నారు. సెక్షన్ 6 ప్రకారం సిబిఐ ఏపిలో దాడులు లేదా దర్యాప్తు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది.ఇంతకు ముందు ఇచ్చిన అనుమతుల్ని రద్దు చేశారు.
అసలు చంద్రబాబు ఈ ఐడియా ఇచ్చింది.. కర్నాటక ముఖ్యమంత్రి కుమార స్వామి. ఇటీవల బెంగళూరు పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ సిబిఐ కి ఇచ్చిన సాధారణ అనుమతిని రద్దు చేసిన అంశం కూడా చర్చకు వచ్చింది. దీంతో చంద్రబాబు కూడా బెంగళూరు నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఆలోచనలకు పదును పెట్టారు. విజయవాడ న్యాయవాది ఇచ్చిన పిటీషన్ అందివచ్చిన అవకాశంగా మారింది. వెంటనే నిర్ణయం తీసుకున్నారు. దీంతోనే చంద్రబాబు ఆగదల్చుకోలేదు. ఈ నెల 22వ తేదిన ఢిల్లీలో జరగనున్న బిజెపీయేతర పక్షాల కూటమి సమావేశం సందర్భంగా ప్రతిపక్షాల అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ఐటీ, ఈడీ, సిబిఐ దాడులు చేయడంపై భారత రాష్ట్రపతిని, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.
పన్ను ఎగవేసిన వారు, తప్పు చేసిన వారిపై దాడులు చేస్తే తాము అనుమతి స్తామని, కానీ రాజకీయ దురుద్దేశంతో చేసే దాడులను మాత్రం వ్యతిరేకిస్తామని స్పష్టం చేయనున్నారు. సివిసి, రాష్ట్రపతి నుంచి ఎటువంటి స్పందన లేని పక్షంలో కోర్టుకు వెళ్లాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. సీబీఐపై చంద్రబాబు నిర్ణయాన్ని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమర్థించారు. బీజేపీ, వైసీప నేతలు మాత్రం విమర్శలు ప్రారంభించారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆ జీవో చెల్లదని వ్యాఖ్యానించారు. కానీ సీబీఐ చట్టం ప్రకారం.. నేరుగా ఇక సీబీఐ ఏపీలో దర్యాప్తు చేసే అవకాశం లేదు. కోర్టులు ఆదేశిస్తే మినహాయింపు ఉంటుంది.