కనకదుర్గమ్మ దర్శనానికి విజయవాడ వచ్చిన.. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో.. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు.. దాదాపు 40 నిమిషాల సేపు సమావేశయ్యారు. వీరిద్దరి మధ్య రాజకీయ అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల అంశంతో పాటు.. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వానికి ఏర్పడుతున్న అడ్డంకులపైనా… వీరిద్దరూ చర్చించుకున్నట్లు తెలుస్తోంది. బీజేపీని ఓడించడానికి ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని ఇద్దరు ముఖ్యమంత్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అందరూ ఎన్నికల కోసమే ఎదురు చూస్తున్నామని కుమారస్వామి వ్యాఖ్యానించారు.
జేడీఎస్ ప్రభుత్వాన్ని భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ముప్పుతిప్పలు పెట్టడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కర్ణాటక సీఎం కుమారస్వామిల మధ్య చర్చ జరిగింది. సిద్ధరామయ్య… తాను ముఖ్యమంత్రి అవుతానని ప్రకటించడం.. ఆయన మద్దతుదారులైన ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతారన్న ప్రచారం జరుగుతూండటంపైనా.. వారి మధ్య చర్చలు జరిగాయి. అయితే లోక్‌సభ ఎన్నికల వరకూ.. కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేయదని.. చంద్రబాబు విశ్లేషించారు. అలా చేస్తే.. ఆ ప్రభావం దేశం మొత్తం ఉంటుందని… ఆ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీ ప్రభావం అసలు ఉండదని.. కేంద్ర రాజకీయాల కోసం అయినా కాంగ్రెస్ పార్టీ.. కర్ణాటకలో తగ్గి వ్యవహరించక తప్పని.. చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది.
ఎన్డీయేను ఓడించేందుకు కలిసొచ్చే అన్ని ప్రాంతీయ పార్టీలను కలుపుకొనిపోతామని చంద్రబాబు సమావేశం తర్వాత మీడియాకు చెప్పారు. దక్షిణాదిలో ఉన్న అన్ని పార్టీలను ఏకం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు ప్రాథమికంగా కొన్ని చర్చలు జరిపినట్లు మరోమారు భేటీ అవుతామని ప్రకటించారు. కుమారస్వామి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మొత్తానికి అనూహ్యంగా విజయవాడలో జరిగిన రెండు ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రుల సమావేశం… నేషనల్ హాట్ టాపిక్‌గా మారింది.