కర్ణాటకలో కాంగ్రెస్ – జేడీఎస్ సంకీర్ణ సర్కారుకు కాలం ముగిసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన పదిహేను మంది రెబల్స్.. అసెంబ్లీకి హాజరు కాకుండా డుమ్మాకొట్టడంతో.. కుమారస్వామి సర్కార్ పరాజయం పాలయింది. అసెంబ్లీలో ఉన్న సభ్యుల ప్రకారం.. కావాల్సిన మ్యాజిక్ మార్క్ ను.. అందుకోవడంలో.. కుమారస్వామి విఫలమయ్యారు. ఎన్ని రోజులు అవకాశం దొరికినా కనీసం ముగ్గురు, నలుగురు రెబల్స్ ను కూడా బుజ్జగించడంలో… కాంగ్రెస్ నేతలు విఫలమయ్యారు. ఫలితంగా.. కుమారస్వామి మాజీ ముఖ్యమంత్రి అయ్యారు.
కర్ణాకట అసెంబ్లీలో మొత్తం 224 మంది సభ్యులుండగా 16 మంది రాజీనామా చేసి..సభకు రాకుండా ఉండిపోయారు. సభలో సభ్యుల సంఖ్య 208కి పడిపోయింది. మ్యాజిక్ ఫిగర్ 105. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 80 కాగా, 13మంది రాజీనామా చేశారు. ఇద్దరు అనారోగ్యం కారణంగా గైర్హాజరయ్యారు. జేడీఎస్ సభ్యుల సంఖ్య 37 కాగా, ముగ్గురు రాజీనామాలు సమర్పించారు. వీరు ఓటింగ్ కు హాజరు కాలేదు. బీఎస్పీ ఎమ్మెల్యే మద్దతివ్వడంతో సంకీర్ణ కూటమి సంఖ్యాబలం 99 దగ్గరే ఆగిపోయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా 105 మంది ఓటు వేశారు. ఫలితంగా.. సర్కార్ కూలిపోయిది.
ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్-జేడీఎస్ చివరి వరకూ ప్రయత్నాలు చేశాయి. స్పీకర్ విశేష అధికారాలను ఉపయోగించి బలపరీక్షను పలుమార్లు వాయిదా వేసినప్పటికీ…మద్దతు కూడగట్టుకోలేకపోయారు. సంకీర్ణ సర్కార్ మే- 23, 2018, కర్ణాటక 18వ ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారం చేశారు. విపక్షాల ఐక్యతా వేదికగా నిలిచిన అ ప్రమాణస్వీకారం..దేశ రాజకీయాలను మలుపు తిప్పుతుందని అనుకున్నారు. కానీ విపక్షాల ఐక్యతలాగే.. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణం మధ్య పొసగలేదు. పిట్టపోరు..పిట్టపోరు పిల్లి తీర్చినట్లు.. కాంగ్రెస్ – జేడీఎస్ నేతల మధ్య పొసగని వ్యవహారం.. బీజేపీకి పండుగలా మారింది.