కర్ణాటక రాజకీయం అనూహ్య మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కుమారస్వామి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన తన అధికారిక నివాసం నుంచి వెళ్లిపోయారని చెబుతున్నారు. వారం రోజుల కన్నడ రాజకీయ పరిణామాల్లో కుమారస్వామి రాజీనామా ఇంటర్వెల్ మాత్రమేనని.. కాంగ్రెస్, జేడీఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. అసంతృప్త ఎమ్మెల్యేల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ఉంది. ఇది ప్రస్తుతం పదహారుకు చేరింది. వారి రాజీనామాలు ఆమోదిస్తే.. సర్కార్ పతనం ఖాయం. బుధవారం సుధాకర్, నాగరాజు అనే ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని స్పీకర్ రమేష్ కుమార్ ప్రకటించారు.
రాజీనామా చేసిన ఇద్దరు ఎమ్మెల్యేలను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు మాజీ సీఎం సిద్దరామయ్య చేసిన ప్రయత్నం ఫలించలేదు. రెబెల్స్‌ను బుజ్జగించేందుకు.., డీకే శివకుమార్.. ముంబై వెళ్లి చేసిన ప్రయత్నాలు కూడా సక్సెస్ కాలేదు. ఆ ఎమ్మెల్యేలు డీకే శివకుమార్‌తో మాట్లాడేందుకు కూడా ఇష్టపడలేదు. దాంతో పోలీసులు ఆయనను బలవంతంగా వెనక్కి పంపేశారు. మరో వైపు.. కాంగ్రెస్ గేమ్ ప్లాన్ మార్చిందన్న ప్రచారం జరుగుతోంది.
కుమారస్వామి రాజీనామా చేసినా… తర్వాత ముఖ్యమంత్రిగా.. కాంగ్రెస్ అభ్యర్థినే ప్రమాణం చేస్తారని చెబుతున్నారు. సిద్దరామయ్య లేకపోతే.. డీకే శివకుమార్ అదీ కాకపోతే.. మల్లిఖార్జున్ ఖర్గే.. ముఖ్యమంత్రి అవుతారని.. అప్పుడు రెబల్స్ అంతా.. వెనక్కి వస్తారని.. అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలతో కన్నడ రాజకీయం మరింత రాజుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం మార్పుపై.., రెండు , మూడు రోజుల్లో జరిగే పరిణామాలే కీలకం కానున్నాయి.