కుమారి అనగానే గుర్తొచ్చేది హెభా పటేల్.. అప్పుడే ఈ భామ టాలీవుడ్ వదిలిపెట్టి కన్నడ సినిమాలకు వెళ్లిందనుకుంటే మీరు పప్పులో కాలేసి నట్టే. సుకుమార్ రైటింగ్స్ తో తానే ‘కుమారి 21ఎఫ్’ సినిమాను నిర్మించిన సుకుమార్ లాస్ట్ ఇయర్ వచ్చిన సినిమాల్లో బ్లాక్ బస్టర్ హిట్స్ తో తన సినిమా కూడా ఉండేలా చేసుకున్నాడు. తన దర్శకత్వంతోనే కాదు తన పెన్ పవర్ తో కూడా ఆడియెన్స్ ను మెప్పించగలను అని నిరూపించుకున్న సుకుమార్ కుమారికి అన్ని భాషల నుండి రీమేక్ హక్కుల కోసం భారీగా డిమాండ్ ఏర్పడింది.
ఇక శాండిల్ వుడ్ లో ఇలాంటి సినిమాల జోరు ఎక్కువ కాబట్టి అక్కడ కుమారిని వెంటనే స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. కన్నడలో ఈ కుమారి సినిమాను సెవెన్ ఛానల్ మనిక్కనం నారాయణన్, శ్రీ లక్ష్మీజ్యోతి క్రియేషన్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ లో అసోసియేట్ గా పదేళ్ల అనుభవం ఉన్న శ్రీమాన్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడట. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన కాస్ట్ అండ్ క్రూ సెలెక్ట్ చేశారని టాక్. మరి తెలుగులో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న కుమారి కన్నడలో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ కన్నడ సినిమాకు కూడా సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందించడం విశేషం.