‘వైయస్సార్ సీపీలోకి మరో నాయకుడు’ అంటూ సాక్షితోపాటు మరికొన్ని మీడియా ఛానెల్స్ లో ఒక వార్త వచ్చింది. విశాఖపట్నం జిల్లాకు చెందిన మాజీ శాసన సభ్యుడు కుంభా రవిబాబు వైకాపాలో చేరారు. చిత్తూరు జిల్లా పాదయాత్రలో ఉన్న జగన్ దగ్గరకు తన అనుచరులతో సహా రవి వెళ్లి, పార్టీ కండువా కప్పుకున్నారు. గిరిజనులంతా జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారనీ, జగన్ ముఖ్యమంత్రి అయితే తప్ప గిరిజనులకు న్యాయం జరగదని ఆయన అభిప్రాయపడ్డారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు గిరిజనులు తగిన సమయంలో గుణపాఠం చెబుతారంటూ పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు.
ఇదేదో వైకాపా ఆపరేషన్ ఆకర్ష్ ఫలితంగా జరిగిన చేరిక అంటూ కొన్ని కథనాలు వచ్చేస్తున్నాయి. నిజానికి, కుంభా రవిబాబు వైకాపాలో చేరతారనేది చాన్నాళ్ల కిందటి నుంచి నలుగుతున్న వార్త. పాడేరు వైకాపా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పార్టీని వీడటం వెనక కారణం కూడా ఇదే అంశం కదా! రవిబాబు విషయమై కొద్ది నెలల కిందట పెద్ద చర్చే జరిగింది. పాడేరుతోపాటు అరుకు నియోజక వర్గంలో వైకాపా అభివృద్ధి కోసం తాను చాలా కష్టపడుతున్నాననీ, కానీ తన ప్రమేయం లేకుండా కుంభా రవిబాబును ఆ నియోజక వర్గానికి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈశ్వరి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తరువాత, ఇదే విషయమై జగన్ దగ్గర ప్రస్థావిస్తే… అనవసరమైన విషయాల్లో తలదూర్చొద్దంటూ ఆయన ఘాటుగా స్పందించారని గిడ్డి ఈశ్వరి చెప్పిన సంగతి తెలిసిందే. కుంభా రవి పార్టీలోకి వస్తే నష్టం జరుగుతుందని ఆమె ఎంత చెప్పినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదనీ, పార్టీలో తన అభిప్రాయానికి విలువ లేకుండా చేశారంటూ ఆమె తీవ్ర అసంతృప్తితో వైకాపాని విడిచి, తెలుగుదేశంలో చేరారు.
రవిబాబు విషయమై ఇంత రగడ జరిగింది కాబట్టి… ఆయన్ని వైకాపాలోకి తీసుకునేముందు కొంత పునరాలోచన జరిగితే బాగుంటుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమైనట్టు ఆ మధ్య కథనాలు వచ్చాయి. నిజానికి, రవిబాబు మొదట వైకాపాలోనే ఉండేవారు. 2014 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరారు. ఆ పార్టీ నుంచి టిక్కెట్ వస్తుందని కూడా ఆశించారు. కానీ, చివరి నిమిషంలో ఆయనకు టిక్కెట్ దక్కలేదు. దీంతో స్వంతంత్ర అభ్యర్థిగా అరుకు నియోజక వర్గం నుంచి పోటీ చేశారు. ఇప్పుడు మళ్లీ సొంత గూటికే వచ్చారు. అంతేగానీ.. ఇదేదో ఆపరేషన్ రివర్స్ ఆకర్ష్ అనీ, లేదా ‘సాక్షి’లో రాసినట్టు వైకాపాలో కొనసాగుతున్న చేరికలో, వారు అభివర్ణిస్తున్నట్టుగా జగన్ పోరాటాన్ని చూసి మద్దతుగా వచ్చి చేరిన నాయకుడిగానో రవిబాబు రాకను చూడటం సరైంది కాదు..!