హైదరాబాద్: ఆంధ్రాలో పుట్టినవాళ్ళంతా రాక్షసజాతివారని నాడు వ్యాఖ్యానించిన కేసీఆర్కు వాళ్ళు నేడు దేవతలలాగా కనిపిస్తున్నారని సీపీఐ సీనియర్ నేత, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ఇవాళ ఒక న్యూస్ ఛానల్ నిర్వహించిన రౌండ్ టేబుల్లో మాట్లాడుతూ కూనంనేని ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కోసం ఆంధ్రావాళ్ళ కాలిలో ముల్లు గుచ్చుకుంటే తమ పంటితో తీస్తానని చెబుతున్నారని విమర్శించారు. ఇప్పుడు సెటిలర్లకు టిక్కెట్లు కూడా ఇచ్చారని చెప్పారు. ఇతర పార్టీలనుంచి టీఆర్ఎస్లోకి వలస వెళ్ళేవాళ్ళంతా ఆ పార్టీపై అభిమానంతోనో, ఆ పార్టీ బాగా మంచి పనులు చేసిందనో వెళ్ళటం లేదని అన్నారు. ఎన్నో ప్రలోభాలు, ఎన్నో ఆశలు, ఎన్నో నిర్బంధాలకు గురిచేసి ఇతర పార్టీలోనివారిని టీఆర్ఎస్లోకి లాగుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఇంటి బిల్లులు, వాటర్ బిల్లులు, కరెంట్ బిల్లులు రద్దంటున్నారని విమర్శించారు. ఓటర్లలో కూడా చైతన్యం రావాలని, డబ్బులు తీసుకుని ఓటేయటంవంటివి మానుకోవాలని కూనంనేని సూచించారు.