గ్రూపు రాజకీయాలంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీయే గుర్తొస్తుంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పార్టీ నేతలందరూ ఒకటై అధికారాన్ని దక్కించుకోవడం ఎలా, ప్రజల మన్ననలు పొందడం ఎలా అని ఆలోచించాలి. కానీ, కాంగ్రెస్ నేతలు మాత్రం తమ పదవుల కోసం, పంతం నెగ్గించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తుండటం ఆశ్చర్యకరం. తెలంగాణలో పరిస్థితిని చక్కదిద్దడం కోసం రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ గా కుంతియాను హైకమాండ్ నియమించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన హైదరాబాద్ వచ్చారు. పార్టీ నేతలతో సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అందరూ కృషి చేయాలంటూ పిలుపునిచ్చారు. 2019లోపు పార్టీ పదవుల్లో ఎలాంటి మార్పూ ఉండదని కూడా స్పష్టం చేసేశారు. అక్కడితో ఆగకుండా… వచ్చే ఎన్నికల వరకూ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోనే పార్టీ నడుస్తుందని కూడా చెప్పి వెళ్లిపోయారు. ఇక్కడే సీనియర్లకు మండింది!
కాంగ్రెస్ నాయకులతో వరుసగా సమావేశమైన కుంతియా… అందరితో ఆయన చెప్పిన మాట ఒకటే! ఉత్తమ్ నాయకత్వంలో పార్టీ ముందు సాగుతుందీ అని! ఈ మాటలు సీనియర్లకు ఏమాత్రం రుచించలేదు. దీంతో వారంతా ఒకటై, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని సమాచారం. కుంతియా వచ్చి వెళ్లిన తరువాత సీనియర్ నేతలంతా ఫోన్లలో బాగానే మాట్లాడుకుంటున్నారనీ, ఉత్తమ్ నాయకత్వాన్ని బలపరచడానికి కుంతియా ఎవరంటూ ఆగ్రహిస్తున్నారని తెలుస్తోంది. ఆయన వచ్చి వెళ్లినంత మాత్రాన ఇక్కడ పరిస్థితులు మారిపోవు కదా అని అనుకుంటున్నారు. జైపాల్ రెడ్డి, జానా రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, కోమటిరెడ్డి వెంకట రెడ్డి వంటి సీనియర్లు కుంతియా తీరుపై బాగా గుర్రుగానే ఉన్నారని సమాచారం. మిగతా నేతలెవ్వరూ బయటపడకపోయినా… కోమటిరెడ్డి మాత్రం కుంతియా తీరుపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన చెప్పినట్టుగా ఇక్కడేం జరగదనీ, అందరికీ అవకాశం ఇవ్వడం అనేది కాంగ్రెస్ పార్టీలో ఉంటుందనీ, కాబట్టి ఎవ్వరూ బెంగపడాల్సిన అవసరం లేదని మీడియాతో కోమటిరెడ్డి చెప్పారు.
కుంతియా రాకతో తెలంగాణ కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు తగ్గుతాయని భావిస్తే, ఆయన మరింత రాజేసి వెళ్లినట్టుగా ఉందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఉత్తమ్ కుమార్ కు అనుకూలంగా ఆయన చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టినట్టే ఉన్నాయి. కుంతియా చేసిన వ్యాఖ్యలను ఇప్పటికే హైకమాండ్ కు కొంతమంది పెద్దలు ఫిర్యాదు చేశారనీ, దాంతో సోనియా కూడా కుంతియాను కాస్త మందలించాలరనీ, అక్టోబర్ దాటే వరకూ మాట్లాడొద్దంటూ ఆయన్ని ఆదేశించారనీ కూడా టి. కాంగ్రెస్ సీనియర్లు చెబుతున్నారు. మొత్తానికి, ఏదో అనుకుంటే ఇంకే అయిందన్నట్టు, దిగ్విజయ్ ను తప్పిస్తే తనకు కలిసి వస్తుందని ఉత్తమ్ అనుకుంటే… ఇప్పుడు కుంతియా వచ్చి ఆయన్నే ఇబ్బందుల్లో పడేస్తున్నట్టుగా ఉంది!