తల్లి పుట్టినిల్లు గొప్పతనం గురించి మేనమామకు తెలీదా అంటూ ఓ సామెత ఉంది. అలాగే, తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యవహార శైలి హైకమాండ్ కు తెలియకుండా ఉంటుందా చెప్పండీ..? ఇప్పటికే ఓ అర డజను ముఖ్యమంత్రి అభ్యర్థులు, అంతే సంఖ్యలో పీసీసీ పీఠాధిపతులు ఆశావహుల జాబితాలో ఉన్న సంగతి తెలిసిందే. ఉత్తమ్ ను దించేద్దామన్న వ్యూహాలు, ఎవరికివారు ప్రాధాన్యతలు పెంచుకునే ప్రెజెంటేషన్లు.. ఇలాంటివి హైకమాండ్ చాలానే చూసేసింది. అందుకే, ఇప్పుడు జాగ్రత్తపడుతోందని చెప్పాలి! జాగ్రత్త ఏ విషయంలో అంటే.. రేవంత్ రెడ్డి రాక విషయంలో. తెలుగుదేశానికి రాజీనామా చేసిన రేవంత్, కాంగ్రెస్ లో చేరడం ఖాయమనే ప్రచారం సాగుతోంది. అన్నీ అనుకూలిస్తే ఈనెలాఖరునాడే రేవంత్ చేరిక ఉంటుందని హస్తం నేతలు అభిప్రాయపడుతున్నారు. రాహుల్ గాంధీ సమక్షంలో రేవంత్ కు కండువా కప్పే కార్యక్రమం ఉంటుందనీ చెబుతున్నారు.
ఈ తరుణంలో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ లో ఎలాంటి ప్రాధాన్యత దక్కుతుందనే చర్చ మొదలైంది. ఈ విషయంపై చాలా జాగ్రత్తగా స్పందించారు రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుంతియా. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరితే స్వాగతిస్తామన్నారు. అయితే, దీన్ని ప్రత్యేకంగా చూడాల్సిన పరిస్థితి లేదనీ, గుజరాత్ లో కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీలోకి కొత్తగా వచ్చి చేరుతున్నారనీ, ఇదో రొటీన్ వ్యవహారం అన్నట్టుగా కుంతియా చెప్పారు. అయితే, చేర్చుకునే ముందు ఎలాంటి ఒప్పందాలూ పార్టీ తరఫు ఉండవని ఆయన అన్నారు. ఎవ్వరికీ ఎలాంటి ముందస్తు వాగ్దానాలు చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఒక పద్ధతి ఉందనీ, పార్టీ చేరిన తరువాత ఆయా నేతల పనితీరును పరిశీలించాకనే వారికి సరైన స్థానం హైకమాండ్ కల్పిస్తుందని కుంతియా చెప్పడం విశేషం! ఈనెల 31న రేవంత్ పార్టీలో చేరే అవకాశం ఉందని కుంతియా చెప్పారు.
అధిష్టానం మనసులో మాట ఏంటో కుంతియా వ్యక్తీకరించేశారు. పార్టీలో చేరబోతున్న రేవంత్ పదవి గురించి సూటిగా స్పందించలేదు! ఆయనకు ఇవ్వబోతున్న బాధ్యతల గురించి కూడా చెప్పకుండా దాటేశారు. పార్టీలో రేవంత్ కు ప్రముఖ పాత్ర ఇవ్వబోతున్నట్టు ఇప్పటి నుంచే సంకేతాలు ఇస్తే.. టీ. కాంగ్రెస్ నేతల్లో కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేసేందుకు రెడీగా ఉన్నారు. రేవంత్ ప్రాధాన్యత ఏంటనేది కొన్నాళ్లు సస్పెన్స్ లో ఉంచితేనే.. ఆయన రాకపై మూతివిరుస్తున్నవారిని బుజ్జగించే అవకాశం ఉంటుంది. అందుకే, రేవంత్ రెడ్డి చేరికను వీలైనంత తక్కువ ప్రాధాన్యత గల అంశంగా కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు కుంతియా. ఏదేమైనా, రేవంత్ చేరిక తరువాత టీ కాంగ్రెస్ లో కూడా కొన్ని సమీకరణాలు కచ్చితంగా మారే పరిస్థితే ఉందనేది కుంతియా అప్రమత్తతలోనే కనిపిస్తోంది.