కుప్పం వైసీపీలో పారిపోయిన వారు పోగా మిగిలిన వారు టీడీపీలో చేరిపోయారు. కుప్పం మున్సిపల్ చైర్మన్ సుధీర్ కుమార్ చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. అంతకు ముందే ఆయన మున్సిపల్ చైర్మన్ , కౌన్సిలర్ పదవులకు కూడా రాజీనామా చేశారు. రెండునెలల కిందటే ఆయన పార్టీ మారాలని అనుకున్నారు. కానీ అప్పట్లో టీడీపీ క్యాడర్ వ్యతిరేకత వ్యక్తం చేసింది.దాంతో ఆయన ఆగిపోయారు.
ఇప్పుడు పార్టీ మారడమే కాదు మొత్తం పదవులకు రాజీనామా చేస్తానని రాజీ చేసుకుని పార్టీ కండువా కప్పుకున్నారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో సుధీర్ కుమార్ టీడీపీ నేతల్ని వేధించారు. పోలీసుల సాయం చాలా అరాచకాలకు పాల్పడ్డారు. అలా వచ్చిన పదవిని వదులుకునేందుకు సిద్ధం కావడంతో పార్టీలో చేర్చుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన మరుక్షణం ఐదేళ్ల పాటు కుప్పంలో అరాచకాలు చేసి చంద్రబాబు పర్యటనను అడ్డుకున్న వారు కూడా పెద్ద ఎత్తున కనిపించకుండా వెళ్లిపోయారు. పోటీ చేసి ఓడిపోయిన భరత్ అసలు అడ్రస్ లేరు. అక్కడే ఉన్న వాళ్లు టీడీపీలో చేరిపోతామని బతిమాలుకుని ఆ పని పూర్తి చేశారు. ఇప్పుడు కుప్పంలో వైసీపీ జెండా పట్టుకునేవారు కరువయ్యారు. చంద్రబాబును ఓడించేస్తానని హడావుడి చేసిన పెద్దిరెడ్డి కూడా అటు వైపు చూడటం లేదు.